
* ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
హైదరాబాద్ నగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ప్రయాణంలో అప్రమత్తంగా లేకపోతే అనర్థాలకు దారి తీస్తోంది. ప్రమాదాలకు కారణమై ప్రాణాలను హరిస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న 158 కిలోమీటర్ల పొడవైన, ఎనిమిది లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం చేసేటప్పుడు ఆచితూచి ఉండాల్సిన అవసరాలను తరచూ జరుగుతున్న ప్రమాదాలు చాటి చెబుతున్నాయి. నిన్న ఒక్కరోజే 4 ప్రమాదాలు జరగడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓఆర్ఆర్పై వేగ పరిమితి 100 కి.మీల నుంచి 120 కి.మీలకు పెంచిన తర్వాత ప్రమాదాలు మరింత పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ముగ్గురు అక్కడికక్కడే..
ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముందు వెళ్తున్న కంటైనర్‌ను కారు వెనుక నుంచి కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చిన్నకిష్టాపూర్‌కు చెందిన హనుమోల్ల కరుణాకర్‌రెడ్డి(48) 25 ఏళ్ల కిందట ఉప్పల్ చిలుకానగర్‌లో స్థిరపడ్డారు. హోల్‌సేల్ బియ్యం వ్యాపారం చేస్తున్న ఆయనకు ఆయనకు భార్య సరళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని సాయిబాబ దేవాలయాభివృద్ధి కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కరుణాకర్‌రెడ్డి, తన భార్య సరళ, మరదలు సంధ్యతో కలిసి కారులో జగదేవ్‌పూర్ మండలం నర్సన్నపేటకు బయలుదేరారు. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సాయంత్రం ముగ్గురు తిరిగి ఉప్పల్‌కు పయనమయ్యారు. రాజీవ్ రహదారి మీదుగా ఓఆర్ఆర్ శామీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌కు చేరుకున్నారు. అక్కడ ఓఆర్ఆర్పైకి ఎక్కి ఘట్కేసర్ వైపు బయలుదేరారు. కొంతదూరం వెళ్లగానే వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొంది. కారు లారీ కిందకు చొచ్చుకుపోవడంతో నుజ్జునుజ్జయింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మరో ప్రమాదంలో నలుగురు..
అలాగే, ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డు పై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు TS07 HW 5858 అనే నంబర్ గల బెలినో కారు లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పెద్ద అంబర్ పెట్ నుండి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3.26 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత కారణంగా ఇద్దరి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. పోలీసులు మూడు గంటల పాటు శ్రమించి మృతదేహాలను అతి కష్టం మీద బయటికి తీశారు. మలోత్ చందు లాల్ (29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు(40). గాయపడిన వ్యక్తిని బిఎన్ రెడ్డి నగర్‌లోని ప్రైవేట్ నీలాద్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దాసరి భాస్కర్ మృతి చెందారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
తాజాగా ఒకేరోజు నాలుగు..
నిన్న (సోమవారం) ఒక్కరోజే నాలుగు ప్రమాదాలు ఔటర్ రింగు రోడ్డుపై జరిగాయి. రెండు రోజుల కిత్రం పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్ఆర్పై డివైడర్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఓ మహిళా ఐటీ ఉద్యోగిని దుర్మరణం పాలయ్యారు. ఆమెతో పాటు పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఔటర్ రింగురోడ్డు కోకాపేట ఇంటర్చేంజ్ 1 నుంచి పటాన్ చెరువు వెళ్లే మార్గంలో సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. మంచి రేవుల ప్రాంతంలో ముందు వెళ్తున్న కారును డీసీఎం ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. కారు వెనక భాగం నుజ్జు నుజ్జు కాగా, కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పటాన్చెరువు ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ వద్ద ర్యాంపు దిగుతుండగా కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. నానక్‌రామ్ గూడ ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా సమీపంలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి.
ప్రమాదాల సాధారణ కారణాలు
* అతివేగం: వాహనాలను మితిమీరిన వేగంతో నడపడం.
* డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండటం.
* వాహన నియంత్రణ కోల్పోయి, అదుపుతప్పి డివైడర్లను లేదా ఇతర వాహనాలను ఢీకొనడం.
* ఓఆర్ఆర్పై అతి వేగంతో వెళ్లే వాహనాలను నిరోధించేందుకు స్పీడ్ గన్స్., పెట్రోలింగ్ వంటి ఉన్నాయని పోలీసులు చెబుతున్నా, వేగ నియంత్రణ సరిగా లేకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
……………………………………….