
* వైఎస్ ఆర్ భిక్షతోనే బాలకృష్ణ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు
* మాజీ మంత్రి పేర్ని సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, మచిలీపట్నం : అసలు సైకో బాలకృష్ణ అని మాజీ మంత్రి పేర్ని నాని (PERNI NANI) విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత బాలకృష్ణకు లేదని తెలిపారు. మచిలీపట్నంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తప్పతాగి అసెంబ్లీకి వచ్చి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నానడని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఎంత సంస్కారవంతంగా మాట్లాడే వారని, ఆయన కడపున పుట్టిన బాలకృష్ణ (Balakrishna) ఇంత నీచంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. బాలకృష్ణ లాంటి వారి కోసం అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్ పరీక్షలు పెట్టాలని కోరారు. వైఎస్ ఆర్ భిక్షతోనే బాలకృష్ణ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారన్నారు. ఆనాడు కాల్పుల ఘటనలో వైఎస్ సాయం చేయకుంటే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేదని తెలిపారు. జగన్ (Jagan) ను తిడుతున్న బాలకృష్ణ ఒకప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇప్పించమని వేడుకున్నది వాస్తవం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అఖండ సినిమా విడుదల సమయంలో బాలకృష్ణ (BALAKRISHNA) తనకు ఫోన్ చేసి, జగన్ అపాయింట్మెంట్ ఇప్పించాలని అడిగారన్నారు. వచ్చి కలవాలని చెబితే ఆయన రాలేదని చెప్పారు. జగన్ ఏరోజూ సినిమా వాళ్లను ఇబ్బంది పెట్టలేదని, వినోదం పేదలకు అందాలన్న తాపత్రాయంతోనే టికెట్ల ధరలు తగ్గించాలని సూచించారన్నారు. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌలి వంటి వారు వచ్చి సినిమాల విషయంలో మాట్లాడితే టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వలేదా? అని నిలదీశారు. చిరంజీవి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటికైనా స్పందించి చిరంజీవి (CHIRANJEEVI) లేఖ రాశారన్నారు. సినిమా వాళ్లను చంద్రబాబు వాడుకుని వదిలేస్తారని ఆరోపించారు. సినిమా వాళ్లను జగన్ ప్రభుత్వం గొప్పగా చూసుకుందన్నారు.
……………………………………………….