
Telangana BC Reservation GO
* స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్
* జీవో నెం 9 విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వం
* రేపు విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్
* మొదలైన ఎన్నికల హడావిడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్దమవుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఎంస్ నెం 9 ని శుక్రవారం విడుదల చేసింది. శనివారం చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో పాటు ఉన్నతాధికారులతో తెలంగాణ ఎన్నిక కమిషన్ సమావేశం కానుంది. దీంతో శనివారమే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు సంబందించి ముందుగా ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయితీ ఎన్నికలు తర్వాత ఉండే అవకాశాలున్నట్లు సమాచారం . కాగా రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్‌లు , 565 జడ్పీటీసీ స్థానాలు , 5,763 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అంతా సిద్దం చేశారు. కాగా రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ , వార్డ్ సభ్యుల ఎన్నికలు ఈ ఎన్నికల అనంతరం నిర్వహిస్తారని తెలుస్తోంది.
* మొదలైన ఎన్నికల హడావిడి
రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల హడావిడి మొదలయింది. రాజకీయ పార్టీల్లో అలజడి మొదలయింది. పల్లెల్లో పట్టు సాధించేందుకు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తమ పథకాల ను ప్రచార వ్యాప్తి బలంగా చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ ఎస్ ఇదే అదనుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి తమ పల్లెల్లో తమ పట్టు సడలకుండా ఉండేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకునేందుకు ఉవ్విళ్ళూరు తున్నారు. ఇక బీజేపీ పార్టీ పట్టణ ప్రాంతాలకే పరిమితం అవకుండా పల్లెలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎదురు చూస్తున్నాయి..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం వెలువడే ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ స్థానాలు ఏ వర్గాలకు రిజర్వ్ అయినాయని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్‌కు సరిపోల్చుతూ ఈ సారి తమకే అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
————————–