* నీట మునిగిన బస్ స్టేషన్
* ఇబ్బందుల్లో ప్రయాణికులు
ఆకేరున్యూస్ హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది,అసలే పండగ సీజన్ కావడంతో జనాలు షాపింగ్ లో కోసం బయటకు వెళ్తూంటారు, ఎక్కడ చూసినా వరద నీటితో రోడ్లన్నీ జలమయం కాగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాలకు సైబరాబాద్ ఐటీ కారిడార్ అతలాకుతలం అయింది. సుమారు 26 ప్రధాన రహదారుల్లో వర్షపు నీళ్లు నిలిచిపోయి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
సమస్య తీవ్రతను గుర్తించిన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి, జాయింట్ సీపీ(ట్రాఫిక్) డాక్టర్ గజరావు భూపాల్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. గంగారం, మైహోం మంగళ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాలను పర్యవేక్షించారు. అదేవిధంగా శేరిలింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి వచ్చే మార్గంలో హెచ్‌సీయూ గేట్ నంబర్2, డొయెన్స్ కాలనీ, హెరిటేజ్ జంక్షన్, విప్రో జంక్షన్, బొటానికల్‌గార్డెన్, టి-గ్రిల్ జంక్షన్ ప్రాంతాల్లో వరదనీరు భారీగా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డీసీపీ, ఏసీపీలకు సూచించారు.
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 ఫీట్ల ఎత్తుతో పొంగిపొర్లుతోంది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. మూసీ వరద తాకిడికి పలు ప్రాంతాల్లో గుడులు కూడా మునిగిపోయాయి.
ఆలయంలో చిక్కుకున్న పూజారి కుటుంబం
వరద ఉధృతి ఎక్కువై వరద నీరు ఆలయంలోకి చేరడంతో పురానాపూల్ దగ్గర ఓ శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. వాళ్లు తమను ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది వారికి అల్పాహారం అందించారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
నీట మునిగిన ఎంజీబీఎస్
మూసీ ఒడ్డున ఉన్న మహాత్మగాంధీ బస్‌స్టేషన్(MGBS) నీట మునిగింది. వరద నీరు స్టేషన్లోకి చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సిన, వివిద ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ ఙల్లాలనుంచి వచ్చే బస్‌లను ఆర్టీసీ అధికారులకు ఇతర ప్రాంతాలకు తరలించి ప్రయాణికులను ఆయా ప్రాంతాలకు వెళ్లి బస్‌లు ఎక్కాల్సిందిగా సూచించారు.
…………………………………………………
