
* టీవీకే విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సెటైర్లు
ఆకేరు న్యూస్ డెస్క్ : వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో కాని మే నెలలో కాని తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార డీఎంకే పార్టీ అన్ని హంగులతో ప్రచారంలో దూసుకుపోతుండగా మిగిలిన ప్రధాన పార్టీలు ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నారు. ఇటీవలే తమిళ వెట్రి కళగం పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటుచేస్తున్నాడు. అయితే విజయ్ సభలు శని ఆదివారాల్లో మాత్రమే సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో హీరో విజయ్ ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తానేమీ ఇతర నేతల్లా వారాంతపు రాజకీయ నాయకుడిని కాదంటూ వ్యాఖ్యలు చేశారు. ‘నేను వారంలో దాదాపు ఐదు రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లో కూడా పర్యటిస్తాను. కొందరిలా శనివారాల్లో మాత్రమే బయటకు వచ్చే నాయకుడిని కాదు. ఆదివారాల్లో కూడా ప్రయాణిస్తూనే ఉంటాను. నేను వారంలో ఏ రోజు అని చూడను. ఈ రోజు ఏ రోజు అనేది నాకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఉదయనిధి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.
………………………………………………….