
* సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పండుగలో మహిళలు సమిష్టిగా చేరి పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాకుండా సమాజంలోని ఐక్యత, సౌభ్రాతృత్వం, స్త్రీల గౌరవాన్ని ప్రతిబింబించే వేడుకగా నిలుస్తుంది. కాగా.. సద్దుల బతుకమ్మ పండుగ ఎప్పుడు నిర్వహించుకుకోవాలనే సందిగ్ధం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడిరది. లెక్కల ప్రకారం తొమ్మిదో రోజు అయిన సెప్టెంబర్ 29 సోమవారం రోజున సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేయాలని కొందరు అర్చకులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ నిర్వహించాలని మరికొందరు సూచిస్తున్నారు. దీంతో సద్దుల బతుకమ్మ పండుగ తేదీలపై ప్రస్తుతం కొంత గందరగోళ వాతావరణం నెలకొనగా.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 30వ తేదీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలలో స్పష్టం చేశారు.
…………………………………