
బీఆర్ఎస్కు చావో.. రేవో..!
* పార్టీ భవిష్యత్‌పై ఫలితాల ప్రభావం
* ధీమాగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్
* కేటీఆర్ నమ్మకం నిలబడేనా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనుంది. అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమై.. నవంబర్ 11వ తేదీతో స్థానిక సమురం ముగియనుంది. షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పార్టీలన్నీ సమరానికి సిద్ధంగా ఉండడంతో గెలుపు వ్యూహాలు మొదలుపెట్టాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ రాష్ట్ర సమితికి ఈ ఎన్నికలు మరింత కీలకం కానున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చావో.. రేవో అన్నట్లుగానే ఆ పార్టీ ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం ఉంది.
డైలమాలో శ్రేణులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడినప్పటి నుంచీ బీఆర్ ఎస్ బాస్ పత్తా ఉండడం లేదు. పదేళ్లపాటు అధికారం అనుభవించడమే కాకుండా, ఏకఛత్రాధిపత్యం సాధించిన కేసీఆర్.. ఓటమి అనంతరం స్తబ్దత పాటిస్తున్నారు. అడపాదడపా పార్టీ శ్రేణులతో సమావేశాలు మినహా రాజకీయంగా యాక్టివ్ గా లేరు. అసెంబ్లీ సమావేశాలకు కూడా సరిగా హాజరు కాలేదు. ఓటమిని జీర్ణించుకోలేక కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని, ఇక ఆయన అక్కడే పరిమితం అని అధికార పార్టీ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు పంపుతామని పేర్కొంటోంది. అయినప్పటికీ కేసీఆర్ స్పందించడం లేదు. ఈక్రమంలో గులాబీ శ్రేణులన్నీ డైలమాలో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారాయి.
బీఆర్ ఎస్ కు అనుకూలమేనా?
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చురకలు అంటిస్తూ తనదైన శైలిలో సమాధానమిస్తున్నారు. పార్టీ బాధ్యతలను, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యతలను కూడా తన భుజానే వేసుకుని రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే సమరానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంతేకాదు.. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు అంత ఈజీగా లేవు. ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు. రేవంత్ సర్కారు అమల్లోకి తెచ్చిన సన్న బియ్యం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ వంటివి గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేటీఆర్ శ్రమ ఫలించేనా?
అయితే బీఆర్ ఎస్ మాత్రం.. ‘బాకీ కార్డు’ పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘బాకీ కార్డుల’ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి, మనిషి మనిషికి తెలియజెప్పేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే, అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని తీవ్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వృద్ధులను మోసం చేయడం, యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులు, విద్యార్థినులకు స్కూటీల అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తే విజయ అవకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగితే బీఆర్ ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారనుంది. ఈక్రమంలోనే కేటీఆర్ స్థానిక ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుని ప్రచార వ్యూహాలు రచించే పనిలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
…………………………………………..