
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతా
* హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మద్యం తాగి రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP SAJJANOR) హెచ్చరించారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రంకెన్ డ్రైవ్ చేసే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో అతి ఎక్కువ కష్టపడేది హైదరాబాద్ పోలీసు సిబ్బంది అని, నగర భద్రతకు పది వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. పోలీసు మీ కోసమే పని చేస్తున్నారని, ఎవరికి ఏ సమస్య ఉన్నా దగ్గర ఉండే పోలీస్ స్టేషన్కు రావొచ్చని అన్నారు. నేరుగా తనను కూడా కలవొచ్చని, డయల్ 100కు కూడా ఫోన్ చేయవచ్చని అన్నారు.
ప్రతీ సిటిజన్ ఒక పోలీస్ ఆఫీసరే..
అలాగే ప్రతీ సిటిజన్ ఒక పోలీస్ ఆఫీసరే అని , తమ దృష్టికి వచ్చిన అసాంఘిక పనుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. తాను సైబరాబాద్ లో పని చేసినప్పుడు ప్రజలు అందరూ సహకరించారని, హైదరాబాద్ ప్రజలు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీసులు అనేక విజయాలు సాధించారని, ఇక్కడ ఎంతో మంది గొప్పవాళ్లు పని చేశారని వెల్లడించారు. పీపుల్స్ ఫ్రెండ్లీ (peoples friendly) అని హైదరాబాద్ పోలీసులకు పేరుందని అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల సమాజంలో చాలా మంది నష్టపోతున్నారని, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్ (Drugs) అన్నారు.
వృద్దులూ.. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
అలాగే సైబర్ క్రైం (Cyber Crime) తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, కట్టడికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తామన్నారు. సైబర్ నేరగాళ్లు వృద్దులు బాగా టార్గెట్ చేస్తున్నారని, వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తలు పాటించాలని, వారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. అవగాహన, అప్రమత్తత లేక చాలా మంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ వల్ల సమయం వృథా కావడమే కాదు.. ఆరోగ్యం పాడవుతుందని అన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తానన్నారు.
………………………………………