
* బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికాలోని ఓ ఫిల్లింగ్ స్టేషన్లో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి విషయాన్ని ఎక్స్ లో పోస్టు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ కు చెందిన చంద్రశేఖర్ పోలె బీడీఎస్ పూర్తి చేసి, డెంటల్ సర్జన్ పీజీ కోసం అమెరికా వెళ్లారు. చదువుకుంటూనే అక్కడ ఓ ఫిల్లింగ్ స్టేషన్ లో పార్ట్ టైం పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయం ఇంధనం కోసం వచ్చిన ఓ దుండగుడు ఆకస్మికంగా చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో ఉంటున్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నదని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఎక్స్ లో పోస్టు చేశారు.
………………………………………..