* ప్రజలకు ఎప్పుడూ రుణపడే ఉంటాం
* బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే నాయిని ఫైర్
ఆకేరు న్యూస్ హనుమకొండ : కాంగ్రెస్ (CONGRESS) పార్టీ ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమేనని విశ్వాసంతో కాంగ్రెస్ ను గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( NAYINI RAJENDER REDDY) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ ఢోకా కార్డు విడుదల సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలను వంచించి మోసం చేసిన బీఆర్ ఎస్ పార్టీ ప్రజలకు చేసిన ఢోకాను వివరించేందుకే బీఆర్ ఎస్ ఢోకా కార్డును విడుదల చేస్తున్నామని ఢోకా కార్డులను ప్రజలందరికీ పంపిణీ చేస్తామని నాయిని అన్నారు. పదేళ్లలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ ఎస్ పార్టీది అని నాయిని అన్నారు.
అధికార దుర్వినియోగం చేశారు
పదేళ్లు పాలించిన బీఆర్ ఎస్ పార్టీ అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు — దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిందన్నారు.వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని నాయిని మండి పడ్డారు.
రైతు బీమా అమలు కాలేదు
బీఆర్ ఎస్ గొప్పగా చెప్పుకునే రైతు బంధు దుర్వినియోగం అయిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రైతులకు న్యాయం జరిగిందని నాయిని అన్నారు. పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉండేవని నాయిని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే మొదటి బడ్జెట్లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చేపట్టామని అన్నారు.రైతులకు కనీస మద్దతు ధర కల్పించి న్యాయం చేశామన్నారు.
హామీలను నెరవేర్చని బీఆర్ ఎస్
బీఆర్ ఎస్ పార్టీ 2018 లో ప్రతీ నిరుద్యోగికి రూ. 3 వేల 16 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందని కానీ ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. పరీక్షలు పెడితే పేపర్ లీక్ చేసే అమ్ముకుని నిరుద్యోగులకు అన్యాయం చేశారని నాయిని విమర్శించారు. బీఆర్ ఎస్ పాలనలో పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారన్నారు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్లో ఉన్నాయన్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదని అన్నారు.
ప్రజలకు రుణ పడే ఉంటాం
బీ ఆర్ ఎస్ ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు రుణపడే ఉంటుందన్నారు.
కానీ బీఆర్ ఎస్ లా ప్రజలకు ధోకా చేయలేదని నాయిని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “BRS కా దోఖా “ను ప్రచారం చేయాలని నాయిని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

………………………………………………………………
