* ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం
* రామచంద్రరావు ఎస్సీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు
* ప్రామాణికమైన లెక్కల ప్రకారమే 42 శాతం రిజర్వేషన్లు
* సామాజిక స్పృహ ఉన్నవారంతా ప్రభుత్వానికి సహకరించాలి
* ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్,న్యూ ఢిల్లీ : బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో చట్టబద్దంగా ఆమోదించుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అన్ని రకాల రిజర్వేషన్లనూ బీజేపీ వ్యతిరేకమని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై చట్టసవరణ బిల్లు ఆర్డినెన్స్ ను అడ్డుకుంటున్నదే బీజేపీ నేతలు అని వెల్లడించారు. బీజేపీ నేతలు అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి ఇప్పుడు అడ్డుకుంటున్నారని అన్నారు. బిజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఆమోదింపచేయాలని సవాల్ విసిరారు. బీజేపీ ఫ్యూడలిస్టు పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. గతంలో రామచంద్రరావు హెచ్సీయూలో ఎస్సీలకు వ్యతిరేకంగా పోరాడినట్లు గుర్తు చేశారు. శాసనసభలో మద్దతు ఇచ్చిన బీజేపీ, బీఆర్ ఎస్ న్యాయ ప్రక్రియలోనూ సహకరించాలని కోరారు. ప్రామాణికమైన లెక్కల ప్రకారమే 42 శాతం బీసీ రిజర్వేషన్లను కల్పిస్తున్నామని తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన వారంతా ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వల్ల ఎవరి హక్కులకూ భంగం కలగదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ దే గెలుపు అని, పదేళ్ల పాటు ఆ నియోజకవర్గ ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. సానుభూతి పేరుతో మాగంటి కుటుంబాన్ని బీఆర్ ఎస్ రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
…………………………………
