* అధిష్ఠానం నిర్ణయమే పైనల్
* బీజేపీ త్రిసభ్య కమిటీ సమావేశం నేడు
* అభ్యర్థిపై ఎంపికపై మల్లగుల్లాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఎన్నికల కమిషన్ ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 11న జూబ్లీహీల్స్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో 14వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది. ఈక్రమంలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీ బీఆర్స్ అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఓటర్లను సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి.
అధిష్టానం చేతిలోనే నిర్ణయం
కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఒత్తిడితో ఆయన పేరును కూడా కలిపి నలుగురు పేర్లను స్థానిక నేతలు అధిష్టానానికి సిఫారసు చేశారు. వారిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, టీపీసీసీ ఇన్చార్జి మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సంయుక్తంగా సమావేశమై ఆశావహుల్లో ఫైనల్ జాబితాను రూపొందించారు. నలుగురి పేర్లతో ఢిల్లీకి పంపారు. వీరిలో ఒకరిని అధిష్ఠానం ఎంపిక చేయడమే మిగిలి ఉంది. షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో నేడో రే పో ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అభిప్రాయ సేకరణలో బీజేపీ త్రిసభ్య కమిటీ
బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన అధిష్ఠానం తాజాగా వారితో సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, మాజీ ఎంపి పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత కోముల ఆంజనేయులు ఆ కమిటీలో ఉన్నారు. అభ్యర్థి ఎంపిక బాధ్యత వారిదే. కాగా, బీజేపీ నుంచి నగులుగురు ఆశావహులు లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు అధ్యక్షుడితో సమావేశమైన త్రిసభ్య కమిటీ అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ఈ సమావేశంలో సీనియర్ నాయకులతో పాటు, నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లో గెలుపు గుర్రం ఎక్కగలిగే బలమైన నాయకుడు ఎవరు? స్థానికంగా ఎవరికి మంచి పట్టు ఉంది? అనే అంశాలపై కమిటీ సభ్యులు వివరంగా చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
…………………………………………..
