
* రైతుల కోసం ధర్నా చేస్తే కేసులు పెడుతున్నారు
* ప్రెస్ మీట్లపై నిఘా పెడుతున్నారు
* నోటీసులకు,కేసులకు భయపడం
* మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్
ఆకేరు న్యూస్ హనుమకొండ : రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీస్ పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతులకు యూరియా ఇవ్వడం లేదని, రైతుల పక్షాన యూరియా కొరతకు నిరసనగా… గత నెలలో హనుమకొండ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేయగా… హనుమకొండ పోలీసులు వినయభాస్కర్ పై కేసు నమోదుచేసిన విషయం తెల్సిందే ఈ నేపధ్యంలో నోటీసులు అందించేందుకు ఎస్ఐ సదానందం మంగళవారం బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ రైతుల పక్షాన పోరాడితే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, కేసులు పెట్టినా రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరాడుతాం అని తెలిపారు. ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెడుతాం… అరెస్ట్లు చేస్తామంటే ఆగేది లేదన్నారు. ప్రజల తరపున కొట్లాడేది ఆపేది లేదని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రైతుల కోసం కొట్లాడితే… నాన్ బెయిలబుల్ కేసులు పెడితే భయపడబోయు… కేసులు కొత్తకాదు. అరెస్ట్లు కొత్తకాదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించడం ఆపబోమని, కొట్లాట ఆపమని ఆయన హెచ్చరించారు.
………………………………………………………