
* అదేందయ్యో.. మేమెక్కడా చూడలే
* సోషల్మీడియాలో వీడియో వైరల్
ఆకేరు న్యూస్, డెస్క్ :
నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా.. అవాక్కయ్యారా.. మరక మంచిదే.. టైడ్.. లేదా త్రిఫుల్ ఎక్స్ అంటూ దుస్తుల మరకలు పోగొట్టే డిటర్జెంట్లు, పౌడర్ల గురించి మనం విన్నాం. యాడ్స్ లో చూశాం.. ఇంట్లో వాడాం కూడా. వీటన్నింటికీ భిన్నంగా ఓ వీడియో ఇప్పుడు అందరినీ అవాక్కు చేస్తోంది. సోషల్మీడియా వచ్చాక ఎన్నో వింతలు, విశేషాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, సెలబ్రిటీలే కాదు.. సాధారణ పౌరులు, మహిళలు కూడా తమ టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. వినూత్న ఆలోచనలను పంచుకుంటున్నారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పారాసెటమాల్ టాబ్లెట్ వేసి ఉతికేయండి..
@acharyaveda అనే ఎక్స్ యూజర్ సోషల్మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ మహిళ పారాసిటమాల్ మాత్రతో బట్టలు ఉతికితే మరకలు సులభంగా తొలిగిపోతాయని చెబుతోంది. ‘మురికిగా ఉన్న దుస్తులను శుభ్రం చేయడానికి మీకు సబ్బు లేదా డిటర్జెంట్ అవసరం లేదు. మీ బట్టలు ఎంత మురికిగా ఉన్నా, అవి పూర్తిగా పసుపు రంగులో ఉన్నా.. ఒక బకెట్ నీటిలో వాటిని వేసి పారాసెటమాల్ టాబ్లెట్ లేదా గడువు ముగిసిన టాబ్లెట్ వేసి ఉతకండి’ అని సూచిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జ్వరం వస్తే డిటర్జెంట్ వాడాలా?
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి ఫన్నీ కామెంట్లు చేశారు. అదేందయ్యో.. మేమెక్కడా చూడలే.. అంటూ కొందరు, బట్టలు శుభ్రం చేయడానికి కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది అని మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. బట్టలు ఉతకడానికి పారాసిటమాల్ వాడితే, నాకు జ్వరం వచ్చినప్పుడు డిటర్జెంట్ ఉపయోగించాలా అని మరొకరు ప్రశ్నించారు.
…………………………………………………