
* లంచ్ తర్వాత ప్రభుత్వ వాదనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై హైకోర్టులో వాడివేడిగా విచారణ జరిగింది. ప్రభుత్వ, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నెం.9ని విడుదల చేసింది. జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే, ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోను సవాలు చేస్తూ..రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగా గోపాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 29 ఇంప్లీడ్ పిటిషన్లను కలిపి హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్లు కలిపితే, మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరతాయని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్లు ఇంకా ఏమన్నారంటే..
* బీసీల జనగణనపై ఏకసభ్య కమిషనర్ పారదర్శకంగా లేదని, ప్రభుత్వ జీవో 9, 41ను సవాలు చేస్తున్నామని కోర్టుకు నివేదించారు.
* రిజర్వేషన్ల పెంపు అధికారం ప్రభుత్వానికి ఉన్నా, చట్ట ప్రకారం 50 శాతం మించకూడదని తెలిపారు.
* షెడ్యూల్డ్ ఏరియాలో ఎస్సీలకే రిజర్వేషన్ల పెంపు అధికారం రాజ్యాంగం కల్పించిందని వివరించారు.
* మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతానికి మించితే సుప్రీంకోర్టు కొట్టి వేసిందన్న అంశాన్ని పిటిషనర్ల తరఫు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
* తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వల్ల 50 శాతం సీలింగ్ పోయిందన్నారు.
* స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఉందన్నారు.
* సీలింగ్ 50శాతం దాటొద్దని రాజ్యాంగంలో ఉందన్నారు.
* అయితే.. బీసీల రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందా అని సీజే ప్రశ్నించారు. ఆగస్టు 31న ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపినట్లు ప్రభుత్వ తరఫు లాయర్లు వెల్లడించారు. ప్రభుత్వ తరఫు లాయర్లు లంచ్ తర్వాత వింటామన్న న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.
………………………………………..