
* “యాపిల్” కూడా అక్కడ వాలేలా నిర్మాణ శైలి
* టీ-స్క్వేర్ భవన నిర్మాణంపై సీఎం కీలక సూచనలు
* ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సర్కారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం టీ-స్కేర్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారిన రాజధాని హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక థీమ్ తో కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేక నిధులతో పాటు, వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. సరికొత్త గుర్తింపు తీసుకొచ్చే ప్రణాళికల్లో భాగంగా టీ-స్కేర్ ను తెరపైకి తెచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీలకు కేంద్రంగా ఇది ఉండేలా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. హైదరాబాద్ అంటే చారిత్రక చార్మినారే కాదు.. ఆధునిక టీ-స్కేర్ గుర్తువచ్చేలా టీ-స్కేర్ ఉండాలని భావిస్తున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
హైదరాబాద్ రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం టీ-స్వేర్ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ఎన్నో డిజైన్లను పరిశీలిస్తోంది. హైదరాబాద్ ఐటీ ఆఫీస్ స్పేస్ ల్యాండ్‌స్కేప్ – రాయదుర్గం మధ్యలో కొత్త ప్రపంచం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా యుగం అవసరాలను సరిపడేలా, హైదరాబాద్ కోసం డిజిటల్ కాన్వాస్‌ను సృష్టించడం దీని లక్ష్యం. టీస్కేర్ భవన నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా, పలు సంస్థలు తమ డిజైన్లను సిద్ధం చేశాయి. న్యూయార్క్ టైమ్స్ స్వేర్ తరహాలో 24 గంటలూ సందర్శకుల ను ఆకట్టుకునేలా టీ-స్వేర్ను రూపొందించేలా నిపుణులతో చర్చిస్తోంది. నవంబర్ నాటికి పనులు ప్రారంభించేలా చర్యలు చేడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహించారు. ఇది హైదరాబాద్‌కు ఒక ఐకానిక్ నిర్మాణంగా, ప్రత్యేక ప్రదేశంగా ఉండాలని అధికారులను కోరారు.
ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా..
నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఆయన రెడ్డి శనివారం రోజున కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఏఐ హబ్, టీ-స్క్వేర్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టీ-స్క్వేర్ ప్రాజెక్టుపై పలు సూచనలు చేశారు. ప్రతిపాదిత టి-స్క్వేర్ కోసం శక్తివంతమైన, ప్రత్యేకమైన డిజైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇది హైదరాబాద్‌కు ఒక ఐకానిక్ నిర్మాణంగా, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని చెప్పారు.
నవంబర్ నాటికి పనులు
టీ-స్క్వేర్ పనులు నవంబర్ చివరి నాటికి ప్రారంభమయ్యేలా తగిన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈమేరకు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనంలా ఉండాలని… అందుకు అనుగుణంగా డిజైన్, నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. టీ-స్క్వేర్ డిజైన్ పర్యాటకులను ఆకర్షించడం, రెస్టారెంట్లు, వ్యాపారం వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఆ ప్రాంతం 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా ప్రదేశాన్ని తీర్చిదిద్దాలని తెలిపారు. పెద్ద ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, రంగురంగుల డిజిటల్ ప్రకటనల ద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్ప్లే తో రూపొందించాలని చెప్పారు. యాపిల్ లాంటి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు అక్కడ వ్యాపారం నిర్వహించేలా ఉండేలా ఏర్పాట్లు, పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
…………………………………….