
* ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడిస్తామంటున్న నిరుద్యోగులు
* 1000 మందిమి నామినేషన్లు వేస్తామని ప్రకటన
* మాల సంఘాల నుంచీ నిరసన స్వరం
* 200 మందిమి నామినేషన్లు వేస్తామని వెల్లడి
* తాజాగా ట్రిఫుల్ ఆర్ రైతుల పోరుబాట
* 200 మంది బాధిత రైతులు నామినేషన్లు వేస్తారని ప్రకటన
* బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ తప్పదా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు పెరుగుతున్నాయి. సర్వేలు, అభిప్రాయ సేకరణలు.. కాచివడపోచి అభ్యర్థిని అయితే ఖరారు చేశారు కానీ, ఎన్నికలో పార్టీ విజయం కత్తిమీద సాములాగ మారినట్లుగా సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక వేదికగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని, ఆగ్రహానికి వెళ్లగక్కేందుకు కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడిస్తామని ప్రకటిస్తున్నాయి. వందల సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నాయి.
1000 నామినేషన్లు.. 30 అంశాలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1000 మంది నిరుద్యోగులం నామినేషన్లు వేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ప్రకటించింది. తమ డిమాండ్లతో కూడిన 30 అంశాల ప్రాతిపదికగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రకటనలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 300 మంది నామినేషన్లు వేస్తారని మరో నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రకటించారు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని అన్నారు. ప్రభుత్వం గ్రూప్-1ను మరింత జఠిలం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేయాలని ప్రభుత్వం యత్నిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
మాల సంఘాల జేఏసీ నుంచి 200 మంది
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 200 మందితో నామినేషన్ వేస్తామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రాంచందర్ తెలిపారు. వర్గీకరణ పేరుతో ఎస్సీలోని 58 కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకే నామినేషన్ వేయనున్నట్టు వారు ప్రకటించారు. రాష్ట్రంలో మాల సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని మండిపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో పేద రైతుల భూములు గుంజుకుంటున్నారని అన్నారు. కొండారెడ్డిపల్లికి కోట్లు మిగతా పల్లెలకు తూట్లా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా విఫలం అయ్యారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.
మేం సైతం అంటూ బాధిత రైతులు
వికారాబాద్ జిల్లాలో నాలుగు మండలాల మీదుగా ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)ను వ్యతిరేకిస్తూ రైతులు సైతం పోరుబాట పట్టారు. ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించారు. పాత అలైన్‌మెంట్‌తోనే ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని, కొత్త అలైన్మెంట్ ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డుకు తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో త్రిబుల్ ఆర్ భూ బాధిత రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీగా ఏర్పాటయ్యారు. మండలాల వారీగా ఏర్పాటైన జేఏసీలు కలిసి జిల్లా జేఏసీగా ఏర్పడి తమ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు తమ పోరాటంలో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మంది రైతులతో నామినేషన్లు వేయించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
అదే జరిగితే బ్యాలెట్టే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగులు, రైతులు, రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులు, ఇతరులు ఎన్నికల్లో పోటి చేస్తామని ప్రకటించారు. తాము వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 20 మంది నామినేషన్లు వేసిన నేపథ్యంలో 21వ తేదీ వరకు ఎన్ని నామినేషన్లు దాఖలవుతాయన్నది తేలాల్సి ఉంది. అభ్యర్థుల సంఖ్య గరిష్టంగా 64 దాటితే బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుదని సంస్థలోని ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కవిత నిజామాబాద్ ఎంపీగా పోటి చేశారు. ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో అక్కడా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించారు. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునిత నిన్న నామినేషన్ వేశారు.