
* ఠాణాకు తీసుకెళ్తుండగా ఘటన
*అడ్డుకున్న ఎస్ ఐపై దాడి.. ఆపై పరార్..
*నిజామాబాద్ జిల్లాలో ఘోరం
* కానిస్టేబుల్ హత్యపై డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్
*పోలీసులకే రక్షణ లేకుండాపోయిందంటున్న ప్రజలు
ఆకేరున్యూస్, నిజామాబాద్ : కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి చంపాడు ఓ దొంగ. అదుపులోకి తీసుకున్న కానిస్టేబుల్‌పై ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. పలు చోరీల్లో నిందితుడైన రియాజ్ ను సీసీఎస్ ఎస్సై భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్ అరెస్టు చేశారు. పట్టణంలోని ఖిల్లా ప్రాంతంలో పట్టుకున్న పోలీసులు.. నిందితున్ని తనిఖీ చేయకుండానే ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. వినాయక్‌నగర్ వద్ద నిందితుడు కత్తి తీసి కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచాడు. అడ్డుకున్న ఎస్ ఐపై దాడిచేసి పరారయ్యాడు. గాయపడిని కానిస్టేబుల్ ప్రమోద్ను ఆసుపత్రికి తీసుకెళుతుండగానే మార్గమధ్యలో మృతి చెందినట్టు వైద్యులు దృవీకరించారు. ఈ సంఘటన పోలీస్ కలకలం రేపింది.
పోలీసులకు రక్షణ కరువు..
పోలీసులకు రక్షణ కరువైంది. నిందితులను అదుపులోకి తీసుకునే సందర్భంలో ప్రాథమిక తనిఖీలు చేపట్టకుండానే అదుపులోకి తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ఏదైనా కేసులో అదుపులోకి తీసుకునే నిందితున్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. తనిఖీ చేసిన అనంతరం అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలి. హంతకుడు రియాజ్ విషయంలో ప్రాథమిక జాగ్రత్తలు పాటించకపోవడం.. కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలను బలి తీసుకుంది. సంఘటనలు.. ప్రమాదాలు.. హత్యలు చోటుచేసుకున్న సందర్భాల్లో పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణా సమయంలోనే నేర్పిస్తారు. కానీ అలాంటి జాగ్రత్తలు రియాజ్ విషయంలో తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి
డీజీపీ సీరియస్..
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్‌ను హతమార్చిన ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. రియాజ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలన్నారు. వారికి అవసరమైన సహాయం చేయాలని సూచించారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
…………………………………………