
* రాజకీయ పార్టీల నిరసనలు, ర్యాలీలు
* డిపోలకే పరిమితమైన బస్సులు
* సత్తుపల్లి డిపో ఎదుట నాయకుల తోపులాట
*ఓయూలో టిఫిన్ సెంటర్‌పై విద్యార్థి సంఘాల దాడి
*ఇదీ..ఆరంభమే మంత్రి పొన్నం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణా స్తంభించింది. రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. హైదరాబాద్ సహా.. ఉమ్మడి జిల్లాల్లో రవాణా నిలిచిపోయింది. ఉదయం నుంచే వ్యాపారులు..పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్, సీపీఎం, సీపీఐ ప్రధాన పార్టీలు మద్దతు పలికాయి. బీసీ సంఘాల నాయకులు.. బస్ స్టాప్, ప్రధాన రహదారుల్లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఈ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో పార్టీల కండువా విషయంలో రగడ చెలరేగింది. విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. బంద్ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బస్సులు బంద్ కావడంతో.. నగరాల్లో ఆటో, క్యాబ్ ధరలు రెట్టింపు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. అధికార కాంగ్రెస్ సైతం బైక్ ర్యాలీలు చేపట్టింది. బీసీలకు 42 శాతం వాటా పేటేంట్ హక్కు తమదే నని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ బీజేపీ నాయకులను ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే గణేష్, మంత్రి కొండా సురేఖా, సికింద్రాబాద్ జూబ్లీ స్టేషన్ వద్ద మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ బంద్ లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ వద్ద జరిగిన కార్యక్రమంలో బీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మొత్తంగా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో శాంతియుతంగా బంద్ కొనసాగుతోంది.
కింద పడ్డ వీహెచ్..
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు కిందపడిపోయారు. బంద్ సందర్భంగా హైదరాబాద్ లోని అంబర్ పేట్ లోజరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లెక్సీ పట్టుకొని నడుస్తున్న
వీహచ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయన్ను లేపి పక్కకు తీసుకెళ్లారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్..
కాంగ్రెస్ ఎంఎల్ ఏ వీర్లపల్లి శంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం
ఏర్పడింది. పోలీసులు కలుగజేసుకొని ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతియుతంగా బంద్ నిర్వహించాలని.. అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ హెచ్చరించిన విషయం తెలిసిందే.
స్వల్ప ఉద్రిక్తత..
సత్తుపల్లి డిపో ఎదుట స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బంద్ లో భాగంగా బస్ డిపో ఎదుట నాయకులు పోటాపోటీగా నినాదాలు చేపట్టారు. మాటా మాట పెరిగి తోపులాటకు దారితీసింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు కలుగ చేసుకొని నాయకులు శాంతింపచేశారు. ఓయూలోని టిఫిన్ సెంటర్ పై విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేశారు. ఒకటి రెండు సంఘటనలు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది.
కేంద్రంతో కొట్లాడుతాం..మంత్రి పొన్నం..
ఇదీ అంతం కాదని..ఆరంభమేనని.. ఇక కేంద్రంతో కొట్లాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ వద్దకు పంపిస్తే.. మూడు నెలలుగా నాన్చుతున్నారని.. 42 శాతం వాటాను కేంద్రం వెంటనే అమోదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు నాటకాలు అడుతున్నారని బీసీ బిల్లును వ్యతిరేఖిస్తూనే బంద్‌లో పాల్గొనడం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు
బీసీ బంద్ లో భాగంగా ఆయన అంబర్ పేటలో నిర్వహించిన ర్యాలోలో ఆయన పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపిస్తే కావాలనే పెండింగ్ లో పెట్టారని మహేశ్ ఆరోపించారు.బీజేపీ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు.
కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది : ఈటెల రాజేందర్
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అమలకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సికింద్రాబాద్ లోని జూబ్లీ స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు
…………………………………………………..