
* రెండేళ్ల తరువాత మాదే అధికారం
* కాంగ్రెస్ ను జూబ్లీహిల్స్లో మొదటి దెబ్బ కొడతాం
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోనే కాంగ్రెస్ కు మొదటి దెబ్బ తగులుతుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ కు చెందిన పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరారు, వారికి కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కు మొదటి దెబ్బ జూబ్లీహిల్స్లో పడితే రెండో దెబ్బ రాజేంద్రనగర్ లో పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని కేటీఆర్ అన్నారు. దమ్మంటే వారందరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తధ్యమని కేటీఆర్ జోస్యం చెప్పారు.ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని.. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
………………………………………………