
* మల్లోజులలో ప్రాణ భీతి పెరిగింది
* ఆయుధాలెట్లా అప్పగిస్తారు..
* మావోయిస్ట్ పార్టీ లొంగిపోయే ప్రసక్తే లేదు
* మావోయిస్ట్ పార్టీ నేత అభయ్ ప్రకటన
ఆకేరు న్యూస్, వరంగల్ : విప్లవ ద్రోహులుగా మారిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ ల కు శిక్ష విదించాలని ప్రజలకు సీపీఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మల్లోజుల ( సోను ), తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్ ముఠాను మావోయిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ విప్లవద్రోహంలో సోనుతో భాగస్వామిగా ఉన్న డీకే ఎస్.జెడ్.సీ. ఉత్తర సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జి సతీష్, ముగ్గురు ఎస్.జెడ్.సీ.ఎంలు సంతూ, భాస్కర్ (రాజ్ మన్), రనీతలు 150 మందితో కలిసి, ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి లొంగిపోయారన్నారు. ఈ నలుగురు ఎస్.జెడ్.సీ.ఎంలు సోనులాగే పార్టీని చీలదీసి పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారిపోయారు. తక్కళ్ళ పల్లి వాసుదేవ రావు అలియాస్ సతీష్ గత కొద్ది నెలలుగా పోలీసు ఉన్నతాధికారులతో, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు మంత్రితో సంబంధాల్లో వుంటూ కోవర్టుగా వ్యవహరించినట్టుగా ఈ మధ్యకాలపు పరిణామాల ద్వారా అర్థమవుతోంది. సోను, సతీష్ ల్లో దశాబ్దకాలం నుండి కొనసాగుతున్న మితవాద భావాలు క్రమంగా మితవాదంగా మారి, కగార్ యుద్ధంతో అది మితవాద అవకాశవాదంగా మారి ఇపుడు అది విప్లవ ద్రోహంగా, విప్లవ ప్రతిఘాతక స్థాయికి చేరింది. ఈ పరిణామాన్ని సకాలంలో సరిగా అంచనా వేయడంలో మేము విఫలమయ్యాం. ఈ వైఫల్యత ఫలితంగా వాళ్లిద్దరు తమ నాయకత్వ స్థానాలను ఉపయోగించుకుని విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం కలిగించారని మావోయిస్ట్ నేత అభయ్ తీవ్రంగా విమర్శించారు. ఈ వైఫల్యాన్ని మేము సమీక్షించుకుని తగిన గుణపాఠాలు తీసుకుంటామని విప్లవ శిబిరానికి తెలియజేస్తున్నాం. విప్లవ ద్రోహులుగా మారిన సోను, సతీష్ ల ముఠా సరైన మార్గంలో విప్లవోద్యమాన్ని పునర్నిర్మిస్తామనడం బూటకం. వాళ్లు కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీల నియంత్రణలో ఉంటూ చేసే ప్రజా పోరాటాలు, నిర్మించే విప్లవోద్యమం ప్రభుత్వ ప్రాయోజిత ప్రజా పోరాటాలుగా ఉంటాయన్నారు. అందుకే ఈ విప్లవ ద్రోహులు ప్రజాపోరాటాల పేరుతో ప్రజల వద్దకు వస్తే వారిని తన్నితరమాల్సిందిగా పిలుపునిస్తున్నామని అభయ్ అన్నారు. సోను, సతీష్ ల విప్లవ ద్రోహాన్ని ఇప్పటికయినా, ఇకముందయినా అర్థం చేసుకుని ప్రజాపక్షానికి తిరిగి రావాల్సిందిగా ఆ ముఠాలోని పార్టీ సభ్యులకు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి వారికి పార్టీ నుండి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీనిస్తున్నామని మావోయిస్ట్ నేత అన్నారు.
తగిన శిక్ష విధించండి ..
విప్లవ తత్వాన్ని కోల్పోయి, విప్లవ ద్రోహిగా, పార్టీ విచ్చిన్నకుడిగా, విప్లవ ప్రతిఘాతకుడిగా మారిన సోనును, ఆయనతో కలిసి శత్రువుకు లొంగిపోయిన సతీష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకే ఎస్.జెడ్.సీ.) సభ్యుడు వివేక్ ను, డీకే ఎస్.జెడ్.సీ. ప్రత్యమ్నాయ సభ్యురాలు దీపను, 10 మంది డివిజనల్ కమిటీ/కంపెనీ పార్టీకమిటీ సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం. విప్లవ ద్రోహం చేసిన ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం.చావు భయంతో పోలీసులకు లొంగిపోవడంతో పాటు పార్టీకి సంబందించిన ఆయుధాలను అప్పగించడం విప్లవ ద్రోహమే కాకుండా పార్టీ విచ్ఛిన్నకర చర్య అన్నారు. పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్, డీకే ఎస్.జెడ్.సీ. ప్రత్యమ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కమిటీ/కంపెనీ పార్టీకమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు మొత్తం 61 మంది అక్టోబర్
14 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలీలో పోలీసులకు లొంగిపోయారు. . మా పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన 50 తుపాకుల్ని శత్రువుకు అప్పగించారు. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర , విప్లవ ప్రతిఘాతకత చర్య అని అభయ్ పేర్కొన్నారు.
మల్లోజులలో ప్రాణ భీతి పెరిగింది
విప్లవ ప్రజలందరు ప్రతిరోజూ శత్రుదాడులను ఎదుర్కొంటూ పనిచేసే పరిస్థితి ఏర్పడింది.
ప్రాణాంతక చుట్టుముట్టి-మట్టుబెట్టే దాడులను ప్రతిఘటిస్తూ ప్రతిరోజూ ప్రాణ త్యాగానికి సిద్దపడి నిబ్బరంగా నిలబడే స్థితిగా మారింది. సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థం , త్యాగానికి సిద్దపడని స్థితికి, ప్రాణభీతికి దారితీసిందని తీవ్ర స్థాయిలో మల్లోజులపై మావోయిస్ట్ నేత అభయ్ విరుచుకుపడ్డారు. తన బలహీనతలను నిజాయితీతో అంగీకరించడానికి ఆయన సిద్ధపడలేదు. 2025 మే నెలలో జరిగిన కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అమరత్వం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేసాయని మావోయిస్ట్ నేత అభయ్ అన్నారు. 2011 చివరి నుండి గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం, దేశవ్యాప్త విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనకంజకు గురయ్యాయి. అప్పటి నుండి సోనులో రాజకీయ బలహీనతలు బయటపడ్తూ వచ్చాయి. 2020 డిసెంబర్ లో జరిగిన కేంద్రకమిటీ సమావేశంలో సోను దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై స్వీయాత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్నిప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్రకమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఎప్పటికపుడు జరుగుతూ వచ్చిన కేంద్రకమిటీ (సీసీ), పొలిట్ బ్యూరో (పీబీ) సమావేశాల్లో ఆయనలోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి సీసీ, పీబీలు కృషి చేసాయి. 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్లీనం సోనులోని వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని (బ్యురాక్రసీని) తీవ్రంగా విమర్శించి, వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన డీకే ఎస్.జెడ్.సీ. సమావేశాల్లో ఎస్.జెడ్.సి. సభ్యులు ఆయనలోని అన్యవర్గధోరణులను సరిదిద్దడానికి విమర్శలు పెడుతూ వచ్చారని మావోయిస్ట్ నేత అన్నారు. సోను తనలో దీర్ఘకాలంగా ఉన్న అహంభావాన్ని సరిదిద్దుకోని ఫలితంగా తన బలహీనతలకు, ప్రాణభీతికి ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ- సైనిక పంథా (వ్యూహం) ఫలితంగా భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారి తీసిందన్న సూత్రీకరణ చేసాడన్నారు. ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు పత్రికా ప్రకటనను విడుదల చేసాడన్నారు.
సీఎం ఫడ్నవిస్‌తో ఎప్పటి నుంచో సంబంధాల్లో ఉన్నాడు
గత సంవత్సరం చివర్లో తన జీవిత సహచరిని, మరికొందరిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుండే సోను దేవేంద్ర ఫడ్నవీస్ తో, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాల్లో ఉన్నాడని ఈ మధ్యకాలపు పరిణామాల ద్వారా అర్థమవుతున్నది. ఇలా విప్లవ పార్టీలో ఉంటూనే శత్రువుతో సంబంధాలు కొనసాగించడం అంటే విప్లవ ద్రోహిగా (రెనగేడ్ గా), కోవర్టుగా మారడమని అర్థం అవుతోందన్నారు. అలాంటి విప్లవ ద్రోహికి, కోవర్టుకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననడానికి నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం.
తను రాసిన వాటిపై విశ్వాసం ఉంటే..
నిజంగా సోనుకు తను రాసిన వాటిపై విశ్వాసం ఉంటే పార్టీలో ఉంటూ, కేంద్రకమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించడానికి సిద్దపడాలి. ప్రాణత్యాగానికి సిద్దపడి విప్లవోద్యమానికి నాయకత్వం అందిస్తూనే తన అభిప్రాయాలను, తన వాదనలను కేంద్రకమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించి విప్లవోద్యమంలోని తప్పులను సరిదిద్దడానికి కృషి చేసి ఉంటే ఆయనలో తన వాదనల పట్ల తనకు విశ్వాసం ఉందని, నిజాయితీ ఉందని అంగీకరించే వాళ్లమని అభయ్ అన్నారు . అందుకు సిద్ధపడకుండా, పార్టీ నిర్మాణ పద్ధతిని పాటించకుండా, శత్రువు ముందు లొంగిపోయాడు అంటేనే ఆయనలో తన వాదనల పట్ల తనకే విశ్వాసం లేదని, నిజాయితీ లేదని, తన వాదనలు కేవలం తన ప్రాణభీతిని కప్పిపుచ్చుకునే అవకాశవాదం అని తేలిపోయింది. ఈ రకమైన తప్పుడు వాదనలతో విప్లవ శిబిరాన్ని, పార్టీ కాడర్లను, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులను మోసగించడం, శత్రువు ముందు లొంగిపోవడం విప్లవ ద్రోహమవుతుందన్నారు.
ఆయుధాలెట్లా అప్పగిస్తారు..
, నిర్మాణ క్రమశిక్షణను ఉల్లంఘించి గత కొద్ది నెలలుగా వివిధ స్థాయిల పార్టీకమిటీ సభ్యులతో, పార్టీ సభ్యులతో, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులతో చర్చించి పార్టీనిచీలదీసే కుట్రకు పూనుకున్నాడు. పార్టీ రాజకీయ-సైనిక పంథాపై దృఢంగా నిలబడిన పార్టీకమిటీ సభ్యులను, పార్టీ, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులనుపథకం ప్రకారం దూరం పెడ్తూ వచ్చాడు. ఇవి అరాచకవాద, పార్టీ విచ్చిన్నకర చర్యలేనని మావోయిస్ట్ నేత అన్నారు. సోను, ఆయన అనుచరులు శత్రువుకు లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని పార్టీకి అప్పగించాలని కేంద్రకమిటీ ఈ మధ్య విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసినప్పటికీ దాన్ని పాటించకుండా, ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు.
ఎంతో మంది పార్టీ సభ్యులు శత్రు సాయుధ బలగాలతో పోరాడి ప్రాణాలర్పించి వారినుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని శత్రువుకు అప్పగించడమంటే విప్లవకారులను హత్య చేయమని చెప్పడమే అవుతుందన్నారు. ఇది విప్లవ ప్రతిఘాతకత (కౌంటర్ రెవెల్యూషనరీ) అవుతుంది. సోను చేస్తున్న వాదనలోని మోసాన్ని, అవకాశ వాదాన్ని అర్థం చేసుకోకుండా మోసపోయి ఆయనతో కలిసి వెళ్లి శత్రువుకు లొంగిపోయిన పార్టీ సభ్యులు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు ఇక ముందయినా అర్థం చేసుకుని ప్రజల పక్షానికి తిరిగి రావాల్సిందిగా కోరుతున్నామని మావోయిస్ట్ నేత విజ్ఞప్తి చేశారు.
మావోయిస్ట్ పార్టీ లొంగిపోయే ప్రసక్తే లేదు
సోను, ఆయన అనుచరులు పోలీసులకు లొంగిపోవడం విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టమే. ప్రస్తుతం సోను, ఆయన అనుచరులు లొంగిపోయినా, ఆయన తప్పుడు వాదనలతో ప్రభావితులయి, ప్రాణత్యాగానికి సిద్ధంగాలేని మరికొంతమంది వివిధ స్థాయిల పార్టీకమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు లొంగిపోయినా ఇవి తాత్కాలిక నష్టాలే. ఈ నష్టాల ప్రభావం సాపేక్షికంగా దీర్ఘకాలం ఉండవచ్చన్నారు. అయితే సోను లొంగిపోయిన, వివిధ స్థాయిల పార్టీ నాయకులు, పీ.ఎల్.జీ.ఏ. కమాండర్లు లొంగిపోయినా విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదన్నారు .సోను, సతీష్ లు శత్రువుకు సరెండరయినా రేపు మరొకరు సరెండరయినా మావోయిస్ట్ పార్టీ శత్రువుకు సరెండర్ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు .వర్గాలున్నంతకాలం వర్గపోరాటాలు-వాటి ఉన్నత రూపాలుగా ప్రజాయుద్ధాలు
కొనసాగడం తిరుగులేని చారిత్రక నియమన్నారు. ఈ నియమాన్ని లొంగుబాట్లు మార్చలేవు. కాబట్టి తాత్కాలిక వెనకంజలో సైతం విప్లవోద్యమ పురోగమనం కోసం కృషి చేయడానికి గొప్ప ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ముందుకుసాగుదాం. అంతిమ విజయం ప్రజలదేనని మావోయిస్ట్ నేత అభయ్ స్పష్టం చేశారు.
ఓటములు కూడా ప్రేరణలుగానే మిగులుతాయి.
ప్రపంచంలో విజయవంతమైన విప్లవోద్యమాలే కాదు, ఓడిపోయిన విప్లవోద్యమాలు కూడా పీడిత వర్గాలకు ప్రేరణగానే ఉంటూ వచ్చాయి. స్పార్టకస్ నాయకత్వంలో సాగిన బానిసల తిరుగుబాటు ఓడిపోయిన అది ఈనాటికి ప్రపంచవ్యాప్త ప్రజాపోరాటాలకు ప్రేరణగానే ఉంది, పారిస్ కమ్యూన్ ఓడిపోయినా ఆ ఓటమిని సమీక్షించి గుణపాఠాలు తీసుకుని రష్యా సోషలిస్టు విప్లవం విజయవంతమవడమే కాకుండా ఆ పోరాటం ఇప్పటికీ ప్రపంచ కార్మికవర్గానికి, పీడితులకు ప్రేరణగానే ఉంది. భగత్ సింగ్ తన జీవితకాలంలో తను స్థాపించిన పార్టీ ద్వారా దేశ స్వాతంత్ర్యాన్ని సాధించకపోయినా ఆయన అమరత్వం ఈ నాటికి దేశ ప్రజలందరికీ ప్రేరణగానే ఉంది. పోరాడి ఓడిపోయిన ప్రజలు, ప్రజా నాయకులు, పార్టీలు పోరాటాల పునర్నిర్మాణానికి, పురోగమనానికి ప్రేరణనందిస్తే, పోరాడకుండా శత్రువుకు లొంగిపోయిన ప్రజలు, ప్రజా నాయకులు, పార్టీలు నిరాశను, అవిశ్వాసాన్ని కలిగించి కాలగర్భంలో కలిసిపోతూ వచ్చాయని సీపీఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అన్నారు.
—————————————–