* ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్న అధికారులు
* ‘కూడా’ వేలాన్ని అడ్డుకుంటాం
* బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి
ఆకేరున్యూస్, హనుమకొండ : ప్రభుత్వానికి సిగ్గుండాలి. ప్రజల ఆస్తులను రక్షించాల్సింది పోయి.. భక్షిస్తోంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) ఆధ్వర్యంలో హనుమకొండలోని బాలసముద్రంలో గల 2.27 ఎకరాల (12,957 చదరపు గజాల) ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు వేలం పాట నిర్వహించడం విడ్డూరంగా ఉందని బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షరాలు రావు పద్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదాయం కోసం ఆస్తులను అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. “ప్రభుత్వ ఖజానాను నింపుకోవడం కోసం ఉన్న భూములను అమ్ముకోవడం మానుకోవాలన్నారు. ఇది ప్రజల ఆస్తిని దోచుకోవడమే అవుతోందని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి వేరే వనరులను అన్వేషించాలి కానీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన భూములను అమ్మడం బాధ్యతారాహిత్యం,” అని అన్నారు. ప్రభుత్వ ఆదాయం కోసం విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రావు పద్మరెడ్డి హెచ్చరించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) ఆధ్వర్యంలో హనుమకొండలోని బాలసముద్రంలో గల 2.27 ఎకరాల (12,957 చదరపు గజాల) ప్రభుత్వ భూమిని బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించడంపై ఆమె మండిపడ్డారు. ‘కూడా’ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బహిరంగ వేలంపాటను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమన్నారు. బిజెపి శ్రేణులతో కలిసి ఈ వేలాన్ని అడ్డుకుని తీరుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే ఈ వేలం నిర్ణయాన్ని అధికారులు, ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
