* గురుకులాల్లో రక్షణ కరువు
* బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
* తల్లీదండ్రుల డిమాండ్
* సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
ఆకేరు న్యూస్, హనుమకొండ : పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. వంగర గురుకులంలోని వర్షిత ఉరివేసుకొని మృతి చెందింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరలోని పివి రంగారావు గురుకులంలో చోటు చేసుకున్న ఈ సంఘటన కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. శ్రీ వర్షిత వంగరలోని గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతుంది. దీపావళి సెలవుల తర్వాత గురువారం తిరిగి పాఠశాలకు వెళ్లింది. ఈ రోజు ఉదయం శ్రీ వర్షిత తన తల్లిదండ్రులకు హాస్టల్లో ఉండలేకపోతున్నానని ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే వంగరలోని గురుకుల పాఠశాలకు వెళ్లారు. వారు అక్కడికి చేరుకునే లోపే డార్మెంటరీ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఉపాధ్యాయుల వేధింపులతోనే ఆత్మహత్య : సీపీఎం
ఉపాధ్యాయుల వేధింపులతోనే వంగర గురుకులం విద్యార్థి మృతి చెందిందని స్థానిక సీపీఎం నాయకులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ నియంతలా వ్యవహరిస్తోందని.. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకులంలో ఉన్న సమస్యలు బయటకు తెలియకుండా ఉండేందుకు విద్యార్థులను భయభ్రంతులకు గురి చేస్తున్నారని మండి పడ్డారు. గురుకుల సొసైటీ, జిల్లా కలెక్టర్ స్పందించి బాధ్యులను కఠిన శిక్షించాలని కోరారు.
విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వంగర వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హుజూరాబాద్ ఎంఎల్ ఏ పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా హుజూ రాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వనం తిరుపతి కుమార్తె శ్రీవర్శిత వంగరలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటుందన్నారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
…………………………………………………………………………
