ఆకేరు న్యూస్, హుజురాబాద్ : హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో అనుకోని వర్షాలు రైతన్నలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో జాగ్రత్త పడిన రైతులు అకాల వర్షాల కారణంగా ఎక్కడ పంట చేతికి అందకుండా పోతుందో అని ముందు జాగ్రత్త చర్యగా చాలా చోట్ల వరి పూర్తిగా ఎండకున్న కోతలు చేశారు. ఐకేపీ సెంటర్లు ప్రారంభం కాకపోవడంతో కందుగుల రైతులు కోత కోసిన వడ్లను 2కీిమీ మేర హుజురాబాద్ – పరకాల ప్రధాన రహదారికి ఇరువైపులా ఆరబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గంటల కొద్దీ వర్షం పడటంతో రైతులు తడిసిన వరికుప్పలపై, కొట్టుకుపోతున్న వడ్ల పై టార్పాలీన్లు, సంచులను కప్పుతున్నారు. వర్ష ప్రభావం కమలాపూర్ మండలంలో కూడా అధికంగా ఉంది. తడిసిన వడ్ల రాశులకు మార్కెట్లో ధర రాదనీ, పంట కోసం చేసిన అప్పులు తీర్చేదేెలా అని, ధాన్యం తడవడంతో ఐకేపీ సెంటర్లు ఆలస్యంగా ప్రారంభం అవుతాయేమోననీ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
…………………………………………….
