* కోవర్టు ఆరోపణలకు ఆశన్న కౌంటర్
* లొంగిపోయిన మావోయిస్టులతో కలిసి వీడియో విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లొంగిపోయిన తమను.. మావోయిస్టు పార్టీ విప్లవ ద్రోహులమని చిత్రీకరించడాన్ని మాజీ మావోయిస్టు ఆగ్రనేత ఆశన్న తీవ్రంగా ఖండించారు. కోవర్టులుగా మారి పార్టీకి నష్టం కలిగించారని మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. పోరాట విరమణ అంశం కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు బతికి ఉన్నప్పుడే తీసుకున్న నిర్ణయమని.. అది తాము సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ను ఖండిస్తూ.. లొంగిపోయిన సభ్యులతో కలిసి వీడియోను విడుదల చేశారు.
ఆపదను పసిగట్టే.. ఈ నిర్ణయం
రానున్న రోజుల్లో పార్టీకి వచ్చే ఆపదను పసిగట్టే సీసీ కమిటీ సభ్యులతో చర్చించే అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకుట్లు చెప్పారు. భారీగా ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు సాయుధ పోరాటానికి విరమణ ఇచ్చామన్నారు. కర్రెగుట్ట, మాడ్ ఆపరేషన్స్ ఉంటాయనే ముందస్తు సమాచారంతోనే ఏప్రిల్, మే నెలల్లోనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తాము అనుకున్నట్లు అదే జరిగితే పార్టీ భారీ మూల్యం చెల్లించుకునేదని.. వాటి నివారణకే విరమణ ప్రక్రియపై చర్య జరిగిందన్నారు. సాయుధ పోరాట విరమణ రూపంలోనా.. కేంద్రంతో శాంతి చర్యల రూపంలోనా అని అనుకున్నప్పుడు పోరాట విరమణే.. సరైందని భావించడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆశన్న చెప్పారు.
ఎవరి ఒత్తిడితో లొంగిపోలేదు..
స్వచ్ఛందంగా మేము లొంగిపోయాం తప్పితే.. ప్రభుత్వం నుంచి.. పోలీసుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయంతోనే తాము ఆయుధాలు అప్పగించాం.. ముఖ్యంగా నాపై ఒత్తిడితో పార్టీకి నేను ఇచ్చిన లేఖతో సమీక్ష జరుగుతుంది కావొచ్చు. ఈ మధ్య నాకు వ్యతిరేకంగా పార్టీ వైపు నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా అవాస్తవమే. మొత్తం 210 సభ్యులు కలిసే ఉన్నాం. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి తీసుకున్న నిర్ణయం కాదు.
ఆరోపణలు సహజం..
పార్టీలో ఉండి లొంగి పోయిన తరువాత ఎలాగూ పార్టీ వైపు నుంచి ద్రోహులు అని పేరు వస్తుంది.. అది ఎవరూ లొంగిపోయిన సహజం. అది మాకు ముందే తెలుసు. పార్టీ నుంచి బయటకు వచ్చిన వారిపై ఆరోపణలు వస్తుంటాయని.. అవి నిరాధారమైన వని పేర్కొన్నారు . దీనికి స్పందించాల్సిన అవసరం లేదు. ఆయుధాలు అప్పగించిన ఆ తరువాత జరిగిన పరిణామాలకు తమను నింధిచడం సరికాదన్నారు.
మరో పోరాటం..
పోరాటానికి అంతం ఉండదని.. అది ఏదో ఒక రూపంలో ఉంటుందని మావోయిస్టు నేత ఆశన్న స్పష్టం చేశారు. అది ఎలా ఉండాలో అందరితో కలిసి చర్చించి ముందుకు సాగుతామన్నారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని 90 శాతం మంది ప్రజలు స్వాగతించారన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని భావిస్తున్నాం తప్పితే తాము పార్టీకి నష్టం కలిగించే చర్యలు తీసుకోలేదని.. ఇక ముందూ పార్టికీ నష్టం కలిగించే తప్పడు నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎక్కడో ఉండి మాట్లాడడం కాదని.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. బుద్ధి జీవులు.. ప్రజా సంఘాల నాయకులు తొందరపడి మాట్లడడం సరికాదన్నారు.
………………………………………………..
