* ఇంటింటికీ తిరుగుతూ.. ఓట్లు అడుగుతూ..
* కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం చెమటోడుస్తున్న అమాత్యులు
* నవీన్‌యాదవ్ గెలుపుపై ఆశలు
* విషమపరీక్షగా మారిన విజయం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపోటములపై అభ్యర్థుల ఆత్రుత ఎలా ఉన్నా.. వారి కోసం ప్రచారం చేస్తున్న మంత్రులు, పార్టీ అధ్యక్షులు, కీలక నేతలకు విషమ పరీక్షగా మారింది. ప్రధానంగా అధికార పార్టీకి అక్కడ గెలుపు కీలకమైంది. గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారింది. నోటిఫికేషన్ రాక ముందు నుంచే ముగ్గురు మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేశారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావిడి ప్రారంభించారు. దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులను చేపట్టారు. నోటిఫికేషన్ వచ్చేసరికే నియోజకవర్గం మొత్తాన్ని పలుమార్లు చుట్టేశారు.
ప్రచారంలో చెమటోడ్చుతూ..
నోటిఫికేషన్ విడుదల కాక ముందు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరావు మాత్రమే నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగేవారు. నోటిఫికేషన్ విడుదలై ప్రచారం మొదలయ్యాక దాదాపు మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లోనే తిరుగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు. మీడియా సమావేశాలు, బస్తీ మీటింగ్‌లలో మాట్లాడడమే కాదు.. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో..
తాజాగా జరిగిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రస్తావన తెచ్చారు. ప్రచారం తీరు, గెలుపు అవకాశాలపై మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించిన ముఖ్యమంత్రి.. కొందరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పలువురు మంత్రులు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం నిర్వహించిన ప్రచారంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తలోవైపు తిరుగుతూ ప్రచారాన్ని హీటెక్కించారు.
తలోవైపు అమాత్యులు
నియోజకవర్గంలోని మధురానగర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అహంకారాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ఉప ఎన్నికలో ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలని అన్నారు. మినీ ఇండియా హైదరాబాద్ అబివృద్థికి సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీరామ్‌నగర్ కూడలిలో ప్రచారం చేశారు. బోరబండ మధురానగర్ బస్తీలో జూపల్లి కృష్ణారావు, సోమాజిగూడ డివిజన్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లో పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొత్తంగా మంత్రులు అందరూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి ఈ విషమపరీక్షలో నెగ్గుతారో లేదో చూడాలి.
…………………………………………..
