* మొంథా తుఫానుపై ప్రధాని ఆరా
* ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్
* పీఎంఓతో సమన్వయం చేసుకోవాలని సూచన
ఆకేరు న్యూస్, అమరావతి : మొంథాతుఫాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సిబ్బందికి ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తూ అలర్ట్ చేస్తోంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై నిరంతరం సమీక్ష జరుపుతోంది. మొంథా తుఫాను (cyclone mondha) ప్రభావం ఏపీపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CHANDRABABU NAIDU)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (NARENDRA MODI) స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. మొంథా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలను మోదీ అభినందించారు. అలాగే, పీఎం(PMO)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మోదీ సూచనల మేరకు పీఎంఓతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్(LOKESH)కు చంద్రబాబు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. మెంథా తుఫాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న చోట ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
………………………………………………….
