* న్యాయశాఖకు జస్టిస్ గవాయ్ సిఫారసు
* నవంబరు 23న గవాయ్ పదవీ విరమణ
ఆకేరు న్యూస్, డెస్క్: సర్వోన్నత ధర్మాసనం సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya kant) నియమితులు కానున్నారు. ఆయన నవంబరు 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) ఈమేరకు న్యాయశాఖకు సూర్యకాంత్ పేరును సిఫారసు చేస్తూ లేఖ రాశారు. సీజేఐ జస్టిస్ గవాయ్ నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే నెల 24నుంచి సూర్యకాంత్ సీజేఐగా వ్యవహరించనున్నారు. 14 నెలలకు పైగా ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఫిబ్రవరి 10, 1962న హర్యానా(Hariyana)లోని హిసార్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ కాంత్.. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 1984లో హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మార్చి 2001లో ఆయన సీనియర్ న్యాయవాదిగా నియామకమయ్యారు. అనంతరం జనవరి 9, 2004న పంజాబ్ హర్యానా హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్టోబర్ 5, 2018 నుంచి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు. 2019 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. గవాయ్ తర్వాత భారత 53వ సుప్రీంకోర్టు (SuprimCourt) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కొనసాగనున్నారు.
………………………………………………………………..
