* ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
* యాక్షన్ లోకి వచ్చిన మొంథా తుఫాన్
* రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
* అప్రమత్తమైన అధికారులు
* ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు
ఆకేరు న్యూస్, డెస్క్ : మొంథా తుఫాన్ విజృంభించింది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో మొంథా ప్రభావం అధికంగా ఉంది. కాకినాడ వద్ద తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నారు.మత్స్యకార ప్రాంతాలలో పర్యటించి సముద్రపు ఒడ్డున ఉన్న తెప్పలను ప్రత్యేక సహాయంతో సమీప ప్రాంతాలకు తరలిస్తున్నారు.ముఖ్యంగా ఎనిమిది జిల్లాలపై ఈ ప్రభావం తుఫాన్ చూపిస్తుందని అధికారులు చెప్పినప్పటికీ తీరం దాటే గోదావరి జిల్లాలపై ఈ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే గోదావరిజిల్లాలో వర్షాలు ప్రారంభం అయ్యాయి.
పరిస్థితిని సమీక్షిస్తున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొంథా తుఫాన్ పరిస్థితిని ఎప్పటిక్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ కలెక్టర్లకు సూచనలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఐటి మంత్రి నారా లోకేష్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.మంత్రి నారా లోకేష్ సిఎంఓ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావతి ప్రాంతాలను పరిశీలిస్తూ అక్కడి నుంచే ఆయా జిల్లాలకు సూచనలు చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పరిస్థితికి తగ్గట్లుగా భారీ స్థాయిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముందుగానే బియ్యంతో పాటు 3 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దొంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అమలాపురం చేరుకున్న ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు
తుఫాన్ తీవ్రత నేపధ్యంలో ముందస్తుగానే ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు అమలాపురం చేరుకున్నాయి, ఎప్పడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కోనసీమ జిల్లాల ఓడరేవుల వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల వెంబడి మెరైన్ పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. ఏపీ తో పాటు తమిళనాడు,పుదుచ్చేరిల్లో కూడా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
……………………………………………..
