* మావోయిస్ట్ అగ్రనేత పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న లొంగుబాటు
* ప్రజలతో కలిసి పనిచేస్తాను.
– మీడియాతో పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సీపీఐ మావోయిస్ట్ పార్టీకి గట్టి దెబ్బ ఎదురు తగిలింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు ముందు లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రన్న లొంగుబాటు గురించి ఇటీవలి కాలంలో ప్రచారం జరిగింది. అనారోగ్య కారణాల వల్ల తాను పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు చంద్రన్న మీడియాకు తెలిపారు. గత 45 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఇక ముందు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తాను. కొద్ది మంది నాయకులు చనిపోవచ్చు. అంత మాత్రాన మావోయిస్ట్ పార్టీ సిద్దాంతం ఓడిపోలేదు. ఆ సిద్దాంతాన్ని ఓడించడం ఎవరి తరమూ కాదు. తుపాకి పార్టీ కి అప్పగించి వచ్చాను. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డిల పిలుపు మేరకు జన జీవన స్రవంతిలో కలిశాను.
* మల్లోజుల మార్గం నా మార్గం కాదు.
మావోయిస్ట్ పార్టీలో చీలిక వచ్చింది. కొంత మంది మల్లోజుల మార్గం వైపు వెళ్లారు. మరి కొద్ది మంది మావోయిస్ట్ పార్టీలోనే కొనసాగుతున్నారు. నేను మల్లోజుల వేణుగోపాల్ , తక్కళ్ళపల్లి వాసుదేవ రావుల మార్గంలో నేను లేను. అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయినప్పటికీ ప్రజల కోసమే పనిచేస్తాను.
* మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీనే ..
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీనీ ఎన్నుకున్నారని చంద్రన్న స్పష్టం చేశారు. మావోయిస్ట్ పార్టీ లో చీలిక వచ్చింది. నేను మాత్రం మల్లోజుల వ్యతిరేకిస్తున్నాను. దేవ్ జీ మార్గాన్ని సమర్దిస్తున్నాను. పార్టీలో చీలికలకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని చంద్రన్న చెప్పారు. చంద్రన్న తో పాటు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ కూడా పోలీసుల ముందు లొంగిపోయారు.
పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఉద్యమ ప్రస్థానం..
పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అలియాస్ సోమన్న పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని
వడ్కపూర్ గ్రామంలో జన్మించారు. తండ్రి పుల్లూరి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేశారు. తల్లీ వరలక్ష్మీ గృహిణి. ప్రసాదరావుకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉంది. 1989లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన డివిజన్ కమిటీ సభ్యురాలు అగు కుర్సంగి మోతి భాయి. అలియాస్ రాధక్కను వివాహం చేసుకున్నాడు. 2013 జూన్లో రాధక్క భద్రద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు అరెస్టు చేశారు. 2015 లో విడుదలయి.. ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తోంది.
1978లో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కపూర్లో పది చదివాడు. అనంతరం పెద్దపల్లి జూనియర్ కళాశాలలో చేరాడు. రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్లో పని చేస్తున్న దగ్గు రాజలింగంతో పరిచయం ఏర్పడింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావుకు అనుచరునిగా పని చేశాడు. 1980లో పీపుల్ఫ్ పార్టీలో చేరి.. అరెస్టు అయ్యాడు. డిసెంబర్లో జైలు నుంచి విడుదలై స్వగ్రామానికి వెళ్లి తిరిగి 1981లో పార్టీతో సంబంధాలు కొనసాగించాడు. 1983లో కమాండర్ స్థాయికి చేరుకొని ఉద్యమాన్నికొనసాగించాడు. 1987లో డివిజన్ కమిటీ సభ్యునిగా..1992 డివిజన్ కమిటీ కార్యదర్శిగా.. 1995లో ఉత్తర తెలంగాణ కమిటీలోకి తీసుకున్నారు. 2006లో ఖమ్మం జిల్లా కమిటీకి వెళ్లారు. 2007లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా పని చేశాడు. 2008లో కేంద్ర కమిటీ సభ్యునిగా..2021 తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 డిసెంబర్ వరకు కొనసాగారు. 17 సంవత్సరాలుగా
కేంద్ర కమిటీలో వివిధ స్థాయిలో పని చేశారు. 2025 అక్టోబర్ 28న అనారోగ్య కారణాలతో అడవీని వదిలి.. జన బాట పట్టాడు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు.
………………………………………………………
