* అధికారులకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశం
* మేడారంను సంర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.ఎస్. శ్రీనివాస రాజు
ఆకేరు న్యూస్, ములుగు:వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.ఎస్. శ్రీనివాస రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఆర్ అండ్ బి ఈ ఎన్ సి మోహన్ నాయక్ తో కలిసి ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.ఎస్. శ్రీనివాస రాజు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రాంగణం పనులు, పలుచోట్ల చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారులు సమయానికి అన్ని పనులను పూర్తి చేయాలని, ఆయా పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మేడారం అమ్మ వార్లను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని, ప్రస్తుతం చేస్తున్న పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఆర్ ఆండ్ బి, పి ఆర్, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, ఎండోమెంట్ అధికారులు, పూజారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………
