* వేలాది ఎకరాల పంట వర్షార్పణం
* కన్నీళ్లు పెడుతున్న రైతులు
* గుండెలవిసేలా రోదనలు
* సర్కారు కరుణించేనా?
“ఇక నాకు దిక్కెవరు దేవుడా.. నేనేం చేత్తిని అయ్యో.. అంటూ నెత్తినోరు బాదుకుంటూ.. గుండెలవిసేలా రోదిస్తూ నాయనా.. నేనేడ చావాలి..” అంటూ కరీంనగర్ మార్కెట్ యార్డులో ఆ మహిళా రైతు ఎక్కిఎక్కి ఏడుస్తున్న తీరే.. అన్నదాతకు మొంథా మిగిల్చిన కష్టానికి నిదర్శనం. నాలుగు నెలల పాటు కష్టించి, కాపాడుకుంటున్న పంట ఒక్క వానకు నీళ్లపాలైతే.. రైతు కన్నీళ్లకు ఆనకట్ట పడేనా? రైతు కష్టానికి కన్నీళ్లే లాభమా..? దిశ మార్చుకున్న మొంథా తుఫాను.. తెలంగాణ రైతులను ఆగమాగం చేసింది. వేలాది ఎకరాల పంటను తుడిచి పెట్టేసింది. మొంథా మిగిల్చిన కన్నీటిపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
మొంథా తుఫాను ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. చేతికంది వచ్చిన పంటను నీళ్ల పాలైంది. రాష్ట్రవ్యాప్తంగా కురిసన వర్షానికి వరి నేలపాలైంది. ఒక్క వరే కాదు.. పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము పంటను కూడా రైతులు కోల్పోయారు. నీటిలో కొట్టుకుపోతున్న వడ్లను చూస్తూ ఏం చేయాలో పాలుపోక నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు. తుఫాను దాటికి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి సహా పలు పంటలకు నష్టం వాటిల్లగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
దాదాపు 30 వేల ఎకరాలకు పైగా..
తుఫాను ప్రభావంతో తెలంగాణలో 30 వేల ఎకరాల్లో పంట వర్షార్పణం అయినట్లు అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. ఏ రైతు కన్నా ఇంతకన్నా గుండెకోత ఉంటుందా..
కాలువలో కొట్టుకుపోతున్న వడ్లను తనకు చేతనైనంత వరకు వడ్లను కాపాడుకునేందుకు కరీంనగర్లో ఓ మహిళా రైతు చేస్తున్న ప్రయత్నం చూస్తే అర్థం అవుతుంది. నాలుగు నెలల కష్టం.. ఒక్క వర్షానికి కాలువలో కొట్టుకుపోతుంటే తట్టుకోలేక పోయింది. కాలవపాలైన పంట పైకి రాదని తెలిసినా..చేత్తో ఎత్తిపోసే ప్రయత్నం చేసింది. ఇంతలో వచ్చిన అధికారుల కాళ్లావేళ్లా పడి కన్నీరుమున్నీరైంది.
జగిత్యాల, వరంగల్ జిల్లాల్లో..
జగిత్యాలలో భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. పత్తి పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందారు. హనుమకొండ జిల్లాలో కురిసిన కుండపోత వానకు పరకాల రెవెన్యూ డివిజన్లో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వరి నేలవాలింది. వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరగా, పత్తి పంట తడిసిముద్దైంది. వరంగల్ జిల్లాలోనూ భారీగా పంట నష్టం వాటిల్లింది. నర్సంపేటలో పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు నీట మునిగాయి. నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలవాలింది.
రాష్ట్రమంతటా..
ఉమ్మడి మెదక్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కౌడిపల్లి మండలం మొహమ్మద్‌నగర్ సొసైటీ వద్ద ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లావ్యాప్తంగా వరి పంట నేలకొరిగింది. దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లోనూ వరి నేలకొరిగింది. వరి కోతలు చేసి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లాలో మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, అక్బర్పేట-భూంపల్లి మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్, దుబ్బాక పట్టణం ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులో అమ్మకానికి ఉంచిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వరి, పత్తి పంట నీట మునిగింది. కోదాడ నియోజకవర్గం అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతే, చిలుకూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం రాశులను భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ప్రధానంగా మినుము, వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. మరి ప్రభుత్వం అన్నదాతను ఎంత వరకు ఆదుకుంటుందో వేచి చూడాలి.
………………………………………………………………………..
