 
                * సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
* మహిళల వన్డే చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన
* గెలిచిన అనంతరం హర్మన్ ప్రీత్ కన్నీళ్లు
* ఫైనల్లో గెలిచితీరుతామనే ధీమా
* ఫైనల్లో తలపడనున్న భారత్, సౌతాఫ్రికా జట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళల ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్ల్లో గెలుపే లక్ష్యంగా తలపడనుంది. మహిళల ప్రపంచకప్‌లో.. 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు చేరువైంది. భారత్ మహిళా జట్టు ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయంతో మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. జెమీమా రోడ్రిగ్స్ 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులతో అద్భుత బ్యాటింగ్‌తో భారత్ 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. చివరి బౌండరీని అమన్‌జోత్ కౌర్ కొట్టగానే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అక్కడే ఉన్న టీమ్ మెంబర్స్, కోచింగ్ స్టాఫ్‌ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. జెమిమా రోడ్రిగ్స్ వైపు పరుగెత్తి హత్తుకుంది. ఆ క్షణం భారత మహిళా క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు శుభారంభమే దక్కింది. ఓపెనర్ ఫీబీ లిచ్‌ఫీల్డ్ (117), ఎలిస్ పెర్రీ (77), అశ్లే గార్డ్నర్ (63) అద్భుత బ్యాటింగ్‌తో 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. అయితే జెమీమా రోడ్రిగ్స్ 127 పరుగులతో నాటౌట్‌గా నిలవడం, హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులతో సత్తా చాటడంతో భారత్ 48.3 ఓవర్లలోనే 341/5 చేసి చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీనితో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో తొలిసారి 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన ఘనత భారత్ వశమైంది. ఈ రికార్డు పురుషుల, మహిళల జట్లన్నింటిలోనూ మొదటిది. ఫైనల్ పోరు ఆదివారం భారత్ సౌతాఫ్రికాతో హోరా హోరీగా జరగనుంది. సౌతాఫ్రికాపై గెలుపే లక్ష్యంగా మ్యాచ్ కొనసాగనుంది.
………………………………………….

 
                     
                     
                    