 
                * రూ. పది వేలు కాదు.. రూ. 50 వేలు ఇవ్వాలి
* దయనీయ స్థితిలో కౌలు రైతులు
* క్షేత్రస్థాయిలో కనిపించని అధికారులు
* జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆకేరు న్యూస్, కరీంనగర్ : రైతుల గోసను..ప్రభుత్వం, అధికారులు పట్టించుకునే స్థతిలో లేరని.. మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షులురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం యాత్రలో భాగంగా కవిత కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో శుక్రవారం పర్యటించారు. మొంథా ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. వేలాది ఎకరాల్లో వరి నేలకొరిగిందని.. కనీసం ప్రభుత్వానికి రైతులను ఓదార్చే తీరిక లేకుండా పోయిందని.. మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తుఫాన్‌తో రైతులు కష్టాల్లో ఉంటే… తూకాల్లో కొర్రీలు పెడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని 40 కిలోలకే కాంటా వేయాలన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిందని, ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు రైతులను మోసం చేస్తోందని తెలిపారు. పంటలు నష్టపోయి రైతులు అవస్థలు పడుతుంటే.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం బాధాకరమన్నారు. అధికారులు వెంటనే స్వయంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. అనంతరం శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. చేతికొచ్చే దశలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. వేలాది మంది రైతులకు కల్పతరువుగా ఉన్న కల్వలను పట్టించుకోవడం లేదన్నారు.
……………………………………………………………….

 
                     
                     
                    