* సొంత నిధులను విడుదల చేసుకుంటున్న రాష్ట్రాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా అమెరికాలో ఆహార సంక్షోభం తలెత్తింది. న్యూయార్క్ వంటి రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు సొంత నిధులతో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది అమెరికాలో కోట్లాది మందిని, ప్రధానంగా పేదలను ప్రభావితం చేసే సమస్యగా మారింది. ఎందుకంటే ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందే ఆహార సాయం ఆగిపోయింది. ప్రభుత్వం పని చేయకపోవడంతో, ఫుడ్ స్టాంప్స్ వంటి ఫెడరల్ ఆహార సహాయ కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీంతో అత్యవసర ఆహార సహాయం కోసం రాష్ట్రం తరఫున 65 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నామని, దీని ద్వారా 4 కోట్ల మీల్స్ అందిస్తామని గవర్నర్ కేథీ హోచుల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా అమెరికాలో అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, ఫుడ్ స్టాంప్స్ పథకాల ప్రయోజనాలు కోట్లాది మందికి అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. నిధుల కొరత కారణంగా నవంబర్ నెల ప్రయోజనాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేయాలని అక్టోబరు ప్రారంభంలోనే అమెరికా వ్యవసాయ శాఖ రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించింది. రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలోని ఫెడరల్ ప్రభుత్వ షట్డౌన్ కొనసాగుతుండగా, ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చట్టబద్ధంగా ఆమోదించిన అత్యవసర నిధులను విడుదల చేయడానికి ట్రంప్ ప్రభుత్వం నిరాకరిస్తోందని గవర్నర్ హోచుల్ ఆరోపించారు.
ట్రంప్ ప్రభుత్వంపై దావా
ఆహార కొరత కారణంగా న్యూ మెక్సికో ప్రభుత్వం కూడా 30 మిలియన్ డాలర్ల అత్యవసర ఆహార సహాయ నిధిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, 25 రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్లు, అటార్నీ జనరళ్లు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంపై దావా వేశారు. అత్యవసర నిధులను వినియోగించే అధికారం తమకు లేదని ఫెడరల్ ప్రభుత్వం చెబుతుండడాన్ని వారు సవాలు చేశారు. ప్రజలకు ఆహార సహాయం నిరంతరంగా అందించేందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని వారు కోర్టును కోరారు.
………………………………………..
