* ప్రతి పౌరుడికి న్యాయం అందిచడమే లక్ష్యం
*తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్
ఆకేరు న్యూస్, ములుగు: రాజ్యాంగంలోని 21 వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. ములుగు జిల్లా లో నిర్మించ తలపెట్టిన 10 + 2 కోర్ట్ భవనానికి శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్చువల్ గా ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ప్రసంగిస్తూ పౌరునికి ప్రాథమిక హక్కుల పరిరక్షణే ధ్యేయం కావాలని పేర్కొన్నారు. వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం, వనరుల లభ్యత న్యాయ వ్యవస్తకు ఉందని తెలిపారు. మొదట గట్టమ్మ దగ్గర కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ హై కోర్ట్ జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావు హాజరైయారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. వి. పి.సూర్య చంద్ర కళా అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ లు హై కోర్ట్ న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పునాది రాయి వేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాకు న్యాయస్థాన భవన సముదాయం మంజూరు కావడం ఆనందిచదగిన విషయం అన్నారు. కొత్త కోర్టు ఏర్పాటు అనేది సిబ్బందికి, న్యాయవాదులకు మరియు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరం అన్నారు. చారిత్రక నేపధ్యం వున్న ములుగు జిల్లాలో కోర్టు ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని జస్టిస్ తెలిపారు. జస్టిస్ ఎన్.రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కోర్టు భవనాలు న్యాయ దేవాలయాలు అన్నారు. కేసుల్లోని ఇరువర్గాలకు న్యాయం జరిగే విధంగా న్యాయవ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి శబరీష్, సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టీ. కన్నయ్య లాల్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాల చారి, గవర్నమెంట్ ప్లీడర్ డి . రాంసింగ్ ప్రధాన కార్యదర్శి రంగోజు బిక్షపతి, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, జిల్లా అధికారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………………………………………………..
