* మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం
* ప్రేక్షకులతో కిక్కిరిసి పోనున్న నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియం
* సఫారీలతో తలపడనున్న ఇండియన్ గర్ల్స్
* క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ
* 20 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా..?
ఆకేరు న్యూస్ డెస్క్ : క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం లో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని గెలుచుకునేందుకు రెండు జట్లు పోటాపోటీగా బరిలోకి దిగుతున్నాయి. 20 ఏళ్ల నిరీక్షణ ఈ సారి ఫలిస్తుందో లేదో అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2005, 2017లో వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన ఇండియా ముచ్చటగా మూడోసారి ఫైనల్ కు చేరింది. కాగా సౌత్ ఆఫ్రికా టీం ఫైనల్ కు చేరుకోవడం ఇదే మొదటి సారి. ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా తలపడనుంది. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల మధ్య ఈ చారిత్రక మ్యాచ్ జరగనుండటంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.భారత జట్టుకు ఇది మూడో వరల్డ్ కప్ ఫైనల్. 2005లో మిథాలీ రాజ్ సారథ్యంలో జట్టు ఫైనల్ చేరినప్పుడు, ఆ టోర్నీ జరుగుతున్న విషయమే చాలామందికి తెలియదు. ఆ తర్వాత 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో కేవలం 9 పరుగుల తేడాతో ఓటమి పాలై కన్నీటిపర్యంతమైంది. ఆనాటి ఓటమి గుండెలను బరువెక్కించినా, భారత మహిళల క్రికెట్లో నమ్మకాన్ని నింపింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టేడియం టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. దేశమంతా అమ్మాయిల విజయాన్ని ఆకాంక్షిస్తోంది.ఈ టోర్నీలో వరుసగా మూడు ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఆస్ట్రేలియాపై జెమీమా రోడ్రిగ్స్ అద్భుత శతకంతో సాధించిన గెలుపు జట్టులో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. డీవై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో, ఈ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమని అంచనా. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ తుది సమరంలో గెలిచి, 1983లో పురుషుల జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని పునరావృతం చేసి, భారత మహిళల క్రికెట్లో కొత్త శకానికి నాంది పలకాలని హర్మన్ సేన పట్టుదలతో ఉంది.
కళ్లు చెదిరే ప్రైజ్ మనీ..
విజేత జట్టు ఈ సారి కళ్లు చెదిరే ప్రైజ్ మనీని అందుకోనుంది. ఈసారి ఐసీసీ ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్ల మేర పెంచింది. దీంతో, విజేత రూ.4.48 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు. ఇంతటి మొత్తాన్ని పురుషల జట్లకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా గతంతో పోలిస్తే 239 శాతం మేర పెరిగింది. 2023 వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన పురుష జట్టుకు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఇది అధికం కావడం గమనార్హం. తాజా టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన వారు.. విజేతలు అందుకున్న మొత్తంలో సగాన్ని పారితోషికంగా (2.24 మిలియన్) అందుకుంటారు.గ్రూప్ స్టేజ్‌లో పలు విజయాలను అందుకున్న టీమిండియాకు ఇప్పటికే 3.5 లక్షల డాలర్ల నజరానా ఖరారైంది. భారత్ కంటే రెండు విజయాలు అధికంగా నమోదు చేసిన దక్షిణాఫ్రికాకు ఇప్పటివరకూ 4 లక్షల డాలర్లు ఖరారయ్యాయి. టోర్నీలో భారత్ విజేతగా నిలిస్తే వారందుకునే ప్రైజ్ మనీ రూ.42 కోట్లను దాటుతుంది.
…………………………………………………….
