* ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెళ్లిళ్ల మృతి
* కళ్లు మూసి తెరిచేంతలో విధి వారిని కాటేసింది
* ఎంతో మంది జీవితాలు అర్దాంతరంగా ముగిసాయి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కళ్లు మూసి తెరిచేలోగా.. క్షణ కాలం జీవితాలను తారు మారు చేసింది.. ఆ బస్సు ప్రమాదమే ఆఖరి ప్రయాణం అని ఊహించ లేక పోయారు.. ఆఫీస్ పని మీద.. కాలేజీలకని .. వ్యాపారపని మీద,,ఆస్పత్రికని.. బంధువులను కలవడానికని.. ఇలా హైదరాబాద్ కు బయలుదేరిన వారి జీవితాల్లో అదే చివరి రోజు అదే చివరి ప్రయాణం అని ఊహించలేక పోయారు. ఆది వారం సెలవు కావడంతో తిరిగి సోమవారం ఎవరి పనుల మీద వారు యథా లాపంగా ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం వారి వారి కుటుంబాల్లో తీరని ఆవేదనను,ఆక్రోషాన్ని,దుఖాన్ని, పూరించలేని కష్టాలను నింపింది. బాధితుల బాధ హృదయ విదారకంగా ఉంది. కుటుంబసభ్యులలను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో కోల్పోయిన వారికే అర్థం అవుతుంది. చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. జీవితాంతం ఆ తల్లితండ్రులకు తీరని బాధను మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ముగ్గురు కూతుళ్లు ఒకే సారి కనుమరుగయ్యారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఆ ముగ్గురిని బలి తీసుకుంది. ముగ్గురూ తోబుట్టువులు ఇంజినీరింగ్ చేస్తున్నారు. తమ కూతుళ్లను ఇంజనీరింగ్ చదవిస్తున్నామని మురిసిపోతున్న తల్లి దండ్రల మురిపం మూన్నాళ్ల ముచ్చటగా నే మిగిలింది. డ్రైవర్ గా పని చేస్తూ ముగ్గురు బిడ్డలను ఇంజినీరింగ్ చదవిస్తున్నాడు నలుగురు బిడ్డల్లో ఈ నెల 15న పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు. చిన్న కూతుళ్లు ముగ్గరూ ఇంజినీరింగ్ చదువుతున్నారని మురిసి పోయాడు. సోమవారం హైదరాబాద్ లో కాలేజికి బయలు దేరిన ముగ్గురు కూతుళ్లు సాయిప్రియ, తనుషా, నందినిలను బస్ ఎక్కించాడు. టాటా బైబై అని చేప్పాడు కాని అదే చివరి బైబై అని అనుకోలేక పోయాడు. ఎక్కిన కొద్ది సేపటికే బస్సు ప్రమాద వార్త తెలిసింది తల్లిదండ్రులిద్దరూ ఘటనా స్థలికి చేరుకున్నారు. కూతుళ్ల కోసం ఆరా తీశారు. ప్రమాదంలో ముగ్గురూ మరణించారని తెలిసింది. ఇక వారి రోదన హృదయవిదారకంగా ఉంది. ‘మా పిల్లల్ని మాకు తిరిగి ఇప్పించండి’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది.
……………………………………………………..
