* భారీ ఖర్చులకు వెనుకాడని ప్రధాన పార్టీలు
* ఈసీకి చిక్కకుండా పంపకాలు
* పోలింగ్ దగ్గరకొచ్చేసరికి సిద్ధమవుతున్న తాయిలాలు
* అసలు అభ్యర్థి ఖర్చుకు పరిమితి ఎంత?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఎన్నిక ఏదైనా ధనప్రవాహం కొనసాగుతుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల సంఘం పుటాకార దర్పణంతో శోధిస్తున్న, ఎక్కడికక్కడ సిబ్బందిని మోహరించి నిఘా పెడుతున్నా అభ్యర్థులు పంపకాలు చేస్తూనే ఉంటారు. ప్రధాన పార్టీలు చేసేవి చేస్తూనే ఉంటాయి. పంపకాలను, తాయిలాలను అడ్డగించి సీజ్ చేయడం వంటి వాటిని ఈసీ చేస్తూనే ఉంటోంది. అయినప్పటికీ, పోలింగ్ సమయం సమీపించే సరికి ఈసీ కంట పడకుండా వినూత్న పద్ధతుల్లో పంపకాలు చేపడుతుండడం సాధారణమైపోయింది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. డబ్బు పంపకాలతో పాటు.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల వస్తువుల కోసం రూ.కోట్ల ఖర్చుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది.
అసలు రూ.40 లక్షలు.. చేసేది కోట్లు
ఎన్నికల సంఘం పరిమితి ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అభ్యర్థికైనా గరిష్ఠ వ్యయ పరిమితి రూ.40 లక్షలు మాత్రమే ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ పరిమితి రూ.95 లక్షలు. ఎన్నికల ప్రచార ఖర్చుల విషయంలో అభ్యర్థుల మధ్య తారతమ్యాలు లేకుండా చూసేందుకు ఈ పరిమితిని ఈసీ విధిస్తుంది. కానీ ఎన్నిక ఏదైనా ప్రధాన అభ్యర్థులు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. గ్రామపంచాయతీ ఎన్నికల నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల దాకా ప్రతీచోటా అభ్యర్థుల ప్రచారానికి డబ్బు అత్యవసరం. డబ్బును ఖర్చు చేయగలిగే అభ్యర్థులు ముమ్మర ప్రచారం ద్వారా ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఈక్రమంలో వారు సభలు, ర్యాలీలు, ప్రచార యాత్రలు నిర్వహిస్తుంటారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తుంటారు. ప్రచారం కోసం పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలు, పత్రికా ప్రకటనలు, టీవీ ప్రకటనలు, యూట్యూబ్ యాడ్స్‌ను వినియోగిస్తుంటారు. ఇవన్నీ చేయాలంటే చేతినిండా డబ్బులు ఉండాలి. పార్టీలు కూడా బాగా డబ్బు ఖర్చు చేసేవారికే టికెట్లు ఇస్తుంటాయి.
మారిన ఎన్నికల ఖర్చుల తీరు..
ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ప్రజలను ప్రలోభం, భయపెట్టే స్థాయికి ఎన్నికలు చేరిపోయాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు కొందరు అభ్యర్థులు. కానీ 1980వ దశకానికి ముందు జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చు రూ.వేలల్లో కూడా ఉండేది కాదు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సమయంలో డిపాజిట్, వాహనాలు, వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తలకు భోజనాల ఖర్చు మాత్రమే పెట్టేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అప్పట్లో మహా అయితే ఖర్చు రూ.50వేలు కూడా దాటకపోయేదట. ఎన్నికల్లో తమను, తమ పార్టీని నమ్మి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరేవారని చెప్పారు. అయితే 1980 తర్వాత నుంచి జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది.
ఇప్పుడు రూ.వందల కోట్లు
ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా 1990 నుంచి ఎన్నికల ఖర్చు తారస్థాయికి చేరిపోయింది. ఎన్నికల్లో చాలామంది నేరుగా ఓటును అమ్మకానికి పెడు తుండడంతో అభ్యర్థులు సైతం అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని, గెలిచిన తర్వాత తాము ఏ పనిచేయకున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేస్తే సరిపోతోందని భావిస్తుండడంతో ఖర్చు రెట్టింపవుతోంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ధనప్రవాహం వెల్లువలా సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో 58 మంది పోటీలో ఉన్నప్పటికీ, ప్రధానంగా ముగ్గురి మధ్యే తీవ్ర పోటీ జరుగుతోంది. ఎన్నికలో గెలవడం కోసం వారు చేస్తున్న ప్రచారానికి, యాడ్స్‌కు, పెయిడ్ ఆర్టికల్స్‌కు, మద్యం, వస్తువులు, డబ్బు పంపిణీకి ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే దాదాపు ఉప ఎన్నిక ఖర్చు రూ.300 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. ‘హే.. అన్ని వందల కోట్లు ఉంటుందా..’ అని కొందరు చర్చించుకుంటున్నారు.
……………………………………………………………..
