• త్వరలో అందుబాటులోకి ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’
• పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం
• సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0
• క్షేత్ర స్థాయి పర్యటనలతో జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పనుల పరిశీలన
• స్వచ్ఛ జలం.. గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రధమ ప్రాధాన్యం
• అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సాస్కి నిధులకు అనుమతుల స్టేటస్ గురించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రశ్నించారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా ఆమోదించారని, ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై తక్షణం ఆర్థిక శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, సర్వే విభాగం కార్యదర్శి శ్రీ కూర్మనాథ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ శ్రీ బాలూ నాయక్, శ్రీమతి గాయత్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
