* రాసి పెట్టుకోండి.. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం
* 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు పోల్చకండి
* బీజేపీ జూబ్లీహిల్స్ డిపాజిట్ సాధిస్తే.. దేశంలో గెలిచినట్లే
* మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : * సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన వ్యక్తి కేటీఆర్ అని, అటువంటి వ్యక్తి మహిళలకు రక్షణ కల్పిస్తాడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాసి పెట్టుకోండి.. 2034 జూన్ వరకు తామే అధికారంలో ఉంటామని, 2029 జూన్ లో జమిలి ఎన్నికలు వస్తాయని తెలిపారు. మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ను అనుమతి అడిగి 3 నెలలు అవుతోందని, ఇప్పటి వరకు ఆయన అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలిస్తే దేశంలో గెలిచినట్టేనని, పాకిస్తాన్ ను కూడా గెలిచినట్టే అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు. తమపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్లాగా ఉన్నాయని చెప్పారు. శ్రీలీల ఐటమ్ సాంగ్కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కిషన్ రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ ఎస్ది ఫెవికాల్ బంధం అన్నారు. 8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగించారని మండిపడ్డారు. వాళ్ల అప్పులు తీరుస్తూ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్లతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. తాము చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేయడం పక్కన పెట్టి.. అప్పులు చేసి పోయిందన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని.. తమకు ఈసారి అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
………………………………………………………
