* ఎన్నికల విధుల్లో 5000 మంది సిబ్బంది
* పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
* తొలిసారిగా డ్రోన్ పర్యవేక్షణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ్ ఇండోర్ స్టేడియం(Yusufguda Indore Stadium)లో ఎన్నికల సామగ్రి పంపిణీ మొదలైంది. ఉద్యోగులు, సిబ్బంది తమ తమ పోలింగ్ బూత్‌లకు ఎన్నికల సామగ్రి తీసుకెళ్లేందుకు తరలి వచ్చారు. ఎవరికి కేటాయించిన వారి సామగ్రిని తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు.
ఎనిమిది కంపెనీల పారామిలటరీ బలగాలు
స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. 1761 మందికి పైగా స్థానిక పోలీసు సిబ్బందితో పాటు 8 కంపెనీల పారామిలటరీ బలగాలు (Para Militery Force) రంగంలోకి దిగాయి. ఇప్పటికే పోలీసులు 65 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో డేగ కళ్లపై నిఘా ఉంచారు. పార్టీల మధ్య పోరు తీవ్రంగా మారిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలాఉండగా నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలనుు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్..
నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్ కర్ణన్ (Karnan) వెల్లడించారు.
………………………………………………
