* కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మని ప్రజలు
* మీడియాతో మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ ఎస్‌కు చావుదెబ్బ తగిలిందని మంత్రి సీతక్క అన్నారు. ఉప ఎన్నిక ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయమవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. 10 ఏళ్లు ఏమి చేయలేని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసినా కూడా ప్రజలు విశ్వసించలేదని అన్నారు. మంత్రివర్గం, కార్యకర్తలు ప్రజలతో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పక్కా లోకల్ బీసీ బిడ్డ అని.. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను రగిలించినా కూడా ప్రజలు విశ్వసించలేదని తెలిపారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. డ్రగ్స్ క్లబ్స్ పబ్స్‌ను కేటీఆర్ తెచ్చారని ఆరోపించారు. వాటికి ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని అన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయని అన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు లెక్కలోకి తీసుకోలేదని.. ఉప ఎన్నికల్లో తెరవెనకాల ఉండి కేసీఆర్ మాట్లాడడం కాదని.. ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడితే బాగుండేదని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసాం అని చెప్పే కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఒక్కసారైనా ప్రజల వద్దకు వచ్చారా..అని ప్రశ్నించారు. మంచి ఏదో.. చెడు ఏదో ప్రజలకు తెలుసుకున్నారని.. అందుకే కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ ఇస్తున్నారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
…………………………………………….
