* స్టే అలెర్ట్.. స్టే సేఫ్ అంటూ సీపీ హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంచింగ్ పద్మనాభానికే పంచా..! ఓ సినిమాలో కమెడియన్ సునీల్ వాడిన ఈ డైలాగ్ చాలా ఫేమస్. సైబర్ నేరగాళ్లు చేసిన పనిని చూస్తే ఇప్పుడు అలానే ఉంది. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయని, వాటి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని అన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆ సీపీ సజ్జనార్ పేరుతో కూడా ఫేస్ బుక్ నఖిలీ ఖాతా సృష్టించి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు తన పేరుతో ఆపదలో ఉన్నానంటూ డబ్బు మెసేజ్‌లు పంపుతున్నారని, ఎవరూ స్పందించవద్దని హైదరాబాద్ కమిషనర్ (Hyderabad Commissioner) నేరుగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందేశాలను నిజమని నమ్మిన ఒకరు ఇప్పటికే రూ.20,000 వాళ్లకు పంపినట్లు వెల్లడించారు. తన అసలు ఫేస్బుక్ పేజీ లింక్‌ను ప్రజలకు తెలియజేస్తూ అది తప్ప.. తన పేరుతో క్రియేట్ చేసినవి అన్నీ ఖాతాలు మొత్తంగా నకిలీవేనని స్పష్టం చేశారు. సైబర్ మోసగాళ్లను కట్టడి చేసేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ మెటా సహకారంతో ఆ ఫేక్ ఖాతాలను గుర్తించి తొలగించే ప్రక్రియలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రముఖుల పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, అనుమానాస్పద మెసేజ్‌లు, డబ్బులు పంపండి అంటూ వచ్చే మెసేజ్‌లు ఏవీ నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. సైబర్ మోసాలకు పాల్పడే నకిలీ అకౌంట్లు కనిపించినప్పుడు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పౌరులకు సూచించారు. స్టే అలెర్ట్.. స్టే సేఫ్ (Stay Allert.. Stay Safe) అంటూ హెచ్చరిక జారీ చేశారు.
…………………………………………………………………..
