* మృతుల్లో 20 మంది మహిళలు..
* 11 మంది చిన్నారులు ఉన్నారు..
ఆకేరు న్యూస్, డెస్క్ : బస్సు ప్రయాణమంటే నరకానికే అన్నట్లు సాగతోంది.. వరుస ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తున్నారు. ప్రయాణమంటేనే భయపడిపోతున్నారు. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు – ట్యాంకర్ ఢీకొట్టుకున్న సంఘటనలో ఏకంగా 42 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు.. 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. బదర్-మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఘటన జరిగింది. బస్సు ప్రమాదంలో ఎక్కువగా హైదరాబాద్ వాసులే ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులందరూ నిద్రలో ఉన్నారు. ఎక్కువ మంది నిద్రలోనే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకరికంటే ఎక్కువ మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. అక్కడి మీడియా కథనాల మేరకు మృతుల సంఖ్య పెరగనున్నట్లు ప్రచురించారు. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలం దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాయి. ఇండియన్ ఎంబసీ ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హజ్ కమిటీ, ఇండియన్ ఏంబసీ బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన చర్యలు చేపట్టాయి. అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………………….
