* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ ఆగ్రహం
* పత్తి కొనుగోళ్లలో సర్కారు తీరుపై మండిపడ్డ బీఆర్ ఎస్
* ఏనుమాముల మార్కెట్‌ను సందర్శించిన నాయకులు
ఆకేరు న్యూస్, వరంగల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పత్తి రైతులను ఆగం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లడారు. పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్డున పడ్డారని.. రైతులు విధిలేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాలు జరుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే పరిస్థితిలో సర్కారు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు వెంటనే స్పందించి కేంద్రంతో మాట్లాడాలని సూచించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, మాలోత్ కవిత మాజీ మంత్రి హరీష్ వెంట ఉన్నారు.
…………………………………………………………
