* లొంగిపోయిన వాళ్లు హాయిగా ఉన్నారు
* కేంద్ర మంత్రి సంజయ్ సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మావోయిస్టులు ఎక్కడున్నా, ఎందరున్నా లొంగిపోవాల్సిందే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Central Minister Bandi Sanjay) సూచించారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో కానీ, మావోల చేతుల్లో కాదని స్పష్టం చేశారు. చిన్నపిల్లలకు కూడా తుపాకులు ఇచ్చి మావోలు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ(AP)లోని అల్లూరి జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై ఆయన స్పందించారు. మావోయిస్టులు బుల్లెట్ నమ్ముకుని ఉంటే, తాము బ్యాలెట్ నమ్ముకుని అధికారంలోకి వచ్చామని, ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులకు ఇబ్బందులు కలిగించలేదని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్(Operation Kagar) లో ఆదివాసీలు, గిరిజనుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారణమని ఆరోపించారు. అర్బన్ నకల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే.. అడవుల్లో పేద గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అర్బన్ నక్సల్స్ (Urban Naxals) ఏ పార్టీలో ఉన్నా పైరవీల ద్వారా ఆస్తులు పోగేసుకుంటున్నారని, వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారని తెలిపారు. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులు అని చెప్పారు.
…………………………………………
