* రంగంలోకి కీలక నేతలు
* ఉప ఎన్నికల వ్యూహమే అనుసరించే చాన్స్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఉప ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. మున్ముందు వచ్చే ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఖాతా కూడా తెరవని పార్టీ, ఉప ఎన్నికల పుణ్యమా అని రెండు నియోజకవర్గాల్లో పాగా వేసింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక హోరాహెరీగా సాగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జరిగిన ఈ ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీస్తాయని భావించి ఆయన భార్య సునీతకే బీఆర్ ఎస్ అధిష్ఠానం సీటు కేటాయించింది. స్థానికంగా మాగంటికి ఉన్న పేరుకు ఆ సీటు మళ్లీ బీఆర్ ఎస్ కే వస్తుందని అందరూ భావించారు. కానీ రేవంత్ విశేష కృషి, మంత్రుల విస్తృత ప్రచారం, చివరి నాలుగు రోజుల్లో చేసిన పోల్ మేనేజ్ మెంట్ తో ఫలితాలు తారుమారయ్యాయి. సానుభూతిని సైతం కాదని ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారు.
అదే జోష్ కొనసాగించేలా..
అప్పుడు కంటోన్మెంట్, తాజాగా జూబ్లీహిల్స్ నియోజక వర్గాల్లో గెలిచిన ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లిపోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందని భావిస్తున్న పార్టీ శ్రేణులు గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. గ్రేటర్ పై ముఖ్యమంత్రి చూపుతున్న ఆసక్తి, వరుస విజయాల నేపథ్యంలో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో మరికొందరు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పదేళ్లలో కాంగ్రెస్ కు బూత్‌ల వారీగా ఏజెంట్లు కూడా లేని పరిస్థితి. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో చాలా మంది ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
గ్రేటర్ కాంగ్రెస్.. గతంలో ఇలా..
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలిచింది. గెలిచిన ఆ ఇద్దరూ ఎమ్మెల్యేలు అప్పట్లో పార్టీని వీడారు. 2018లో గ్రేటర్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలవలేదు. అయితే వైఎస్ హయాంలో నగర విస్తరణతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏర్పడినా కాంగ్రెస్ హవా కొనసాగింది. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక ఏదైనా ఆ పార్టీ సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంగా గ్రేటర్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్‌గా సుదీర్ఘకాలం పని చేసిన కాంగ్రెస్ కు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో రెండు కార్పొరేటర్ స్థానాలు మాత్రమే సాధించింది. 2021లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మూడు స్థానాలు దక్కాయి. పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ సహా కొంత మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు.
పీఠం పొందాలని..
రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పాలంటే రాజధాని హైదరాబాద్ పై పట్టు ఉండడం ఏ పార్టీకైనా అవసరం. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా దృష్టి సారించింది. గ్రేటర్ లో బలంగా ఉన్న గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల క్రితం ఏఐసీసీ ఇన్చార్జీలు పలు జిల్లాల్లో పర్యటించారు. డివిజన్లు, బ్లాక్‌లు, జిల్లాల వారీగా పార్టీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించారు. వాటి ద్వారా త్వరలో డీసీసీ కమిటీలు, నియోజకవర్గం, డివిజన్, బ్లాక్‌ల వారీగా కమిటీలు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులుగా ఎంపీ, ఎమ్మెల్యేలను నియమించాలని పార్టీ భావిస్తోంది. గతంలో గ్రేటర్లో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉంది. మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇతర పార్టీల్లో ఉండే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. ఏదేమైనా వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి పీఠం కైవసం చేసుకునేలా బలపడాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
………………………………………….
