* రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కానుక
* పేదలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్‌దే
* ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలే యజమానులు
* ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇంటింటికీ ఇందిరమ్మ చీరలు అందించనున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు అందజేస్తామని అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామని పేర్కొన్నారు. బుధవారం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు చీరలను అందజేసి.. అనంతరం సీఎం మాట్లాడారు. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇందిరాగాంధీ కృషి చేశారన్నారు.
కాంగ్రెస్‌కే భూములు పంచిన ఘనత..
పేదలకు భూములు పంచిన ఘతన కాంగ్రెస్‌కే దక్కిందని గుర్తు చేశారు. పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైందని సీఎం చెప్పారు. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధీదని ప్రశంసించారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ప్రోత్సహించామని వివరించారు. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించామన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంగా ముందకు సాగుతున్నామని పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వంలో మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. అని సీఎం చెప్పారు. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేస్తాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. చీరల పంపిణీని ఆయా జిల్లాల్లో కలెక్టర్ పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
………………………………………………………
