* హైదరాబాద్‌లో ప్రారంభమైన ఉద్యమం
* నాయీ బ్రాహ్మణుల ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో కొత్తగా పుట్టుకొస్తున్న కార్పొరేట్ సెలూన్లు తమ పొట్టకొడుతున్నాయని నాయీ బ్రాహ్మణులు ఉద్యమం ప్రారంభించారు. కులవృత్తులను మాయం చేసేలా అలాంటి వాటిని ప్రోత్సహించడం తగదని పేర్కొంటున్నారు. ఈరోజు హైదరాబాద్ నగరం జీడిమెట్ల డివిజన్లోని పైప్‌లైన్ రోడ్డు వద్ద చీఫ్ అండ్ బెస్ట్ కార్పొరేట్ సెలూన్ హఠావో.. నాయిబ్రాహ్మణులకు బచావో అనే బ్యానర్‌తో ఓమ్ మణికంఠ నాయిబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వృత్తిదారుల హక్కులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే జీఓ జారీ చేయాలని, కార్పొరేట్ చీఫ్ అండ్ బెస్ట్ సంస్థను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయిబ్రాహ్మణులు అనాదిగా వస్తున్న కులవృత్తిని నమ్ముకొని చేస్తున్న వారు ఇప్పటికీ కొంత మంది పూట గడవని పరిస్థితి ఉందని, కార్పొరేట్ సంస్థలు వెలిస్తే ఉన్న వృత్తి చేసుకోలేకుండా రోడ్డు మీద పడ తారని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి, జీవో తీసుకురావాలని నాయీ బ్రాహ్మణులు కోరుతున్నారు. కార్పొరేట్ హెయిర్ సెలూన్లతో నాయీ బ్రాహ్మణుల సాంప్రదాయ కుల వృత్తి ఘోరంగా దెబ్బతింటుందని వాపోయారు. ఎంతో మంది నాయిబ్రాహ్మణులు అనాదిగా వస్తున్న కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారన్నారు. ఆ సంస్థ కార్యకలాపాలకు నిరసనగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు నాయీ బ్రాహ్మణులు వెల్లడించారు.
…………………………………………………….
